అబ్కారీ సిబ్బందికి అతి త్వరలో బాడీ వార్న్ కెమెరాలు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మధ్య నిషేదము, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్సైజ్ దాడులకు సంబంధించిన తక్షణ సమాచారం, ఆడియో, వీడియోలను ప్రత్యక్షంగా కేంద్ర కార్యాలయంలో వీక్షించగలిగేలా బాడీ వార్న్ కెమెరాలు పనిచేస్తాయని, వాటిని విజయవాడ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానం చేస్తామన్నారు.
బాడీ వార్న్ కెమెరాలను శరీరానికి కళ్లుగా చెప్పవచ్చని, ఇప్పటివరకు ఈ వ్యవస్ధలను పోలీసు శాఖ మాత్రమ వినియోగిస్తుందన్నారు. కోటి రూపాయల అంచనా వ్యయంతో విజయవాడ కమీషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం కమీషనర్ లాంఛనంగా ప్రారంభించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మీనా మాట్లాడుతూ డిప్యూటి కమీషనర్ స్దాయి అధికారి నేతృత్వంలో సిసిసి పనిచేస్తుందని 24 గంటలు సిబ్బంది సేవలు అందించేలా ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆలంబనతో అబ్కారీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూపొందించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యం డిపోలు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, బీరు తయారీ కేంద్రాలు, చెక్ పోస్టులలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసామని, అక్కడి పరిణామాలను అనుక్షణం పరిశీలించే అవకాశం ఏర్పడిందని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.
సిసిసిలో ఎనిమిది అతిపెద్ద ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేసామని, వాటిలో డిస్టలరీల కోసం రెండు, డిపోల కోసం రెండు, చెక్‌పోస్టులను పరిశీలించేందుకు రెండింటిని అంకితం చేయగా, మరో రెండు తెరలను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ కోసం నిర్ధేశించామన్నారు. ప్రతి డిపో, డిస్టలరీలకు రెండు కెమెరాల వంతున 100 సిసి కెమెరాలు ఏర్పాటు చేసామని, అదే క్రమంలో చెక్ పోస్టుల వద్ద 31 సిసి కెమెరాలు ప్రత్యక్ష నిఘాలో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసారు.
ఎక్సైజ్ కంప్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇసిఎంఎస్) సైతం మంచి ఫలితాలను ఇస్తుందని, నేరం జరిగిన ప్రాంతానికి సిబ్బంది చేరుకున్న మరుక్షణం అక్కడి ఫోటోలను కూడా ఆప్‌లోడ్ చేయాలని ఆదేశించామని, తద్వారా సిబ్బంది పనితీరును కూడా సమీక్షించే అవకాశం ఏర్పడుతుందని మీనా అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిసితో పాటు, ఒక ఎఇఎస్, ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్ఐలు, 13 మంది కానిస్టేబుళ్లు 24 గంటలు విధినిర్వహణలో ఉంటారన్నారు. బాడీ వార్న్ కెమెరాల గురించి వివరిస్తూ ప్రత్యేకించి ఆకస్మిక తనిఖీలకు మొబైల్ పార్టీలకు వీటిని అందిస్తామని, అక్కడ ఏమి జరుగుతుందన్నదానిని కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించటంతో పాటు అప్పటికప్పుడు అవసరమైన అదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్ మాట్లాడుతూ అత్యాధునిక ఎక్సైజ్ పోలీసింగ్‌ను నేడు చూడబోతున్నారన్నారు. బాడీ వార్న్ కెమెరాల ఏర్పాటు వల్ల అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూడగలుగుతామన్నారు. వీటిని సిబ్బంది తమ శరీరానికి ధరించి ఉంటారన్నారు. కార్యక్రమంలో సంయిక్త కమీషనర్‌లు దేవకుమార్, ఓఎస్‌డి నాగేశ్వరరావు, డిసి-కంప్యూటర్స్ రేణుక, ఎసి-ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫ్రణవి , జిఎం-ఆపరేషన్స్ శ్రీష, సిసిసి ఇన్‌చార్జ్ మధుబాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.