పుట్టెడు దుఃఖంలోనూ... మరో ప్రాణం పోకూడదనీ...
తమ కుటుంబానికి జరిగిన తీరని శోకం.. మరో కుటుంబానికి జరగకూడదని పుట్టెడు దుఃఖంలోనూ ఓ మృతుని కుటుంబం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చింది. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే,
విశాఖకు చెందిన రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన ద్విచక్రవాహనంపై విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్‌కు వెళుతూ రహదారి మధ్యలో ఉన్న గంతలో బైకు ముందు చక్రం పడటంతో బండి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాు. ఈ ప్రమాదం మరిచిపోకముందే అదే గుంతలో పడటం వల్ల మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. అయినవారు దూరమైన బాధలో ఉన్నప్పటికీ సగటు మనిషిగా మానవత్వంతో స్పందించారు.
ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదని పేర్కొంటూ సొంత డబ్బులతో సిమెంట్, ఇసుక కొనుగోలు చేసి స్వయంగా గుంతను పూడ్చిపెట్టారు. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనిని ప్రజలే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి గోతులు పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.