శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (08:05 IST)

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..29వరకు మద్యం షాపుల బంద్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12నుంచి 29వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపుల మూసివేయనున్నట్లు కర్నూలులో అనిల్‌కుమార్ ప్రకటించారు. 
 
మరోవైపు స్థానిక సమరం ఊపందుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఇటు టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారుగా లాబీయింగ్‌ చేస్తున్నారు. నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. 
 
ఈనెల 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్‌ కార్యాలయంలో.. జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్‌ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు.. 9 వేల 984 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 24న జరగనుంది. 
 
ఇక పట్టణ, నగర పాలక సంస్థలకు కూడా ఒకే విడతలో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి...  27న లెక్కింపు చేపడతారు.  మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎక్కడికక్కడ ఈ నెల 31న జరుగుతుంది.
 
అయితే కొన్ని వివాదాల కారణంగా 3 కార్పొరేషన్లు, 29 పుర, నగర పంచాయతీల్లో ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. 15 కార్పొరేషన్లకు గాను 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి  కార్పొరేషన్లకు కోర్టు కేసుల రిత్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి. 104 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు గాను 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 29 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.