గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (08:57 IST)

పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా ఉంచుతాం.. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల భవానీ ఐలాండ్ ముంపునకు గురై రూ.2 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు.

మంగళవారం పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, పర్యాటక శాఖ యండి ప్రవీణ్ కుమార్ లతో కలసి భవానీ ఐలాండ్ లో వరద ముంపునకు ఇసుక మేటలు వేసిన, దెబ్బతిన్న వాటిని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. భవానీ ద్వీపంలో పర్యాటక శాఖకు సంబంధించి రక్షణగోడ, ల్యాండ్ స్కేపింగ్, టవర్, రెస్టారెంట్లు, పవర్ షట్ డౌన్, మ్యూజికల్ పౌంటెన్ కు నష్టం జరిగిందన్నారు. అలాగే భవానీ ద్వీపానికి చిహ్నమైన పైలాన్ కాంక్రీట్ బేస్ మెంట్ దెబ్బతిందన్నారు.

వీటిని పునరుద్దరించడానికి, పనులు పూర్తి చేయడానికి 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారన్నారు. అయితే 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వరద తగ్గినందున భవానీ ఐలాండ్ కు బోటులో వెళ్ళి పరిశీలించడానికి, రివర్ కన్వరేటర్లు అనుమతి ఇచ్చారన్నారు.

సెప్టెంబర్ 1 నుండి నదిలో బోట్లు యధావిధిగా తిరుగుతాయని, పర్యాటకులు తమ కుటుంబాలతో నిర్భయంగా భవానీఐలాండ్ ను సందర్శించవచ్చన్నారు. వరదలు రాకముందు ఎలా ఉందో మరలా అలా తయారు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.

ప్రస్తుతం భవానీఐలాండ్ ద్వారా ప్రభుత్వానికి రూ.3 కోట్ల ఆదాయం వస్తున్నదని దీనిని రూ.5 కోట్లకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు. ద్వీపాన్ని ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ల ద్వారా అభివృద్ది చేస్తామన్నారు. వరదలు వచ్చినా ఇబ్బందులు లేకుండా, దెబ్బతినకుండా సెమిపర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయించే ఆలోచన చేస్తున్నామన్నారు.

కనకదుర్గమ్మ అమ్మవారి గుడి నుండి భవానీఐలాండ్ కు రోపవే ఏర్పాటు చేయడానికి ఆధ్యయనం చేస్తున్నామన్నారు. దానివల్ల పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రక్షణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ఆగ్రగామిగా ఉంచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

పర్యాటకం అభివృద్ధికి కేంద్రమంత్రిని కలసి చర్చించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం విధులు, కేంద్ర నిధులతో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఏకో టూరిజం, అధ్యాత్మిక టూరిజం, పురావస్తు టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజంను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఎడ్వంచర్ టూరిజం ఏర్పాటుకు ఢిల్లీ స్థాయిలో చర్చించామని, అందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అయితే అందుకు సంబంధించిన శిక్షణ పొందిన నిపుణుల అవసరం ఉంటుందని, రక్షణ చర్యలు కూడా తీసుకుని ప్రభుత్వం ఎడ్వంచర్ టూరిజం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు. ఈ పర్యటనలో పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.