గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (21:50 IST)

నేతన్నలకు మేలు చేకూరేలా ఆప్కో నూతన విధానం: సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు

Apco
విక్రయాలకు సంబంధించిన నగదు చేనేత సంఘాలకు సకాలంలో చేరేలా నూతన విధానాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగవెంకట మోహన రావు తెలిపారు. తాజా ప్రక్రియలో చేనేత సంఘాలు, ఆప్కో సైతం అతి తక్కువ లాభాలను మాత్రమే పొందగలుగుతాయని తద్వారా వారికి చేతినిండా పనిదొరుకుతుందని వివరించారు.


విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సోమవారం ఈ అంశానికి సంబంధించి చీరాల, మదనపల్లి, చల్లపల్లి, వెంకటగిరి ప్రాంతాలకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో చిల్లపల్లి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ, కన్‌సైన్‌మెంట్ విధానంలో సరుకు నిల్వలను సమకూర్చుకుని, వాటిని అతి తక్కువ లాభదాయకతతో అధిక విక్రయాలు కావిస్తామన్నారు.

 
సంస్ధ ఉపాధ్యక్షురాలు, నిర్వహణా సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఇప్పటివరకు చేనేత సంఘాల నుండి ఆప్కో సేకరించిన వస్త్ర శ్రేణి విషయంలో తిరిగి చెల్లింపుల పరంగా ఉన్న ఇబ్బందులను అధికమించినట్లవుతుందన్నారు. నగరంలోని పిన్నమనేని పాలీ క్లీనిక్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన ఆప్కో సెలబ్రేషన్స్‌లో ఈ ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నామని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామని చదలవాడ పేర్కొన్నారు.

 
కన్సైన్మెంట్ విధానంలో వివిధ రకాల చేనేత వెరైటీల క్రయవిక్రయాలు జరిపి జీఎస్టీతో కలిపి ఒక్క నెలలోనే చెల్లింపులు చేస్తామన్నారు. మరోవైపు ఈ విధానం వల్ల అందుబాటు ధరలలో ఆధునిక వస్త్ర శ్రేణి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. నూతనత్వాన్ని ప్రోత్సహించ గలుగుతామని తద్వారా వినియోగ దారులు మరింతగా ఆప్కో వైపు ఆకర్షితులు కాగలుగుతారని నాగరాణి వివరించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు, ఆప్కో జిఎం కన్నబాబు, సంయుక్త సంచాలకులు మైసూర్ నాగేశ్వరరావు, రాష్ట్ర మార్కెటింగ్ అధికారి రమేషుబాబు, డివిజినల్ మార్కెటింగ్ అధికారి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా చేనేత సంఘాల బలోపేతానికి కృషి చేయాలని అయా సంఘాల ప్రతినిధులు విన్నవించారు.