సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2022 (23:34 IST)

గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు: ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం

Kallam
ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గడువును నేపధ్యంలో సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సూచించారు. భూమిని కొనుగోలు చేసినప్పటికీ పట్టాలు పొందని వారు లక్షల్లో ఉన్నారని వారందరూ తమ హక్కు పత్రాలు పొందగలిగేలా ప్రభుత్వం నూతన అవకాశం ఇచ్చిందన్నారు. బైనామా పత్రాల క్రమబద్దీకరణపై మంగళగిరి భూపరిపాలనా శాఖ ఛీఫ్ కమీషనర్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల నుండి ఎంపికచేసిన డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది కోసం మంగళవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని భూమి హక్కుల కేంద్రం, భూ సర్వే శాఖ సంయిక్త నిర్వహణలో ఈ సదస్సు జరగగా, పూర్తి సమాచారంతో నూతనంగా రూపొందించిన సాదా బైనామాల క్రమబద్దీకరణ పుస్తకాన్ని అజయ్ కల్లం, భూమి రికార్డులు, సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా అజయ్ కల్లం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుపేద రైతుల కోసం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిన బాధ్యత అధికారులదే నన్నారు. ఆర్ఓఆర్ చట్టం నిబంధనలకు లోబడి క్రమబద్దీకరణ చేయాలని సూచించారు. భూమి రికార్డులు, సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ సాదాబైనామాల క్రమబద్దీకరణ గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందన్నారు. 2021 అక్టోబరు మాసాంతంలోపు జరిగిన చిన్న సన్నకారు రైతుల కొనుగోళ్లకు మాత్రమే క్రమబద్దీకరణ చేయగలుగుతామన్నారు. కొనుగోలు చట్టాలకు భిన్నంగా, భూ హక్కుల వివాదం ఉంటే సాదాబైనామాల క్రమబద్దీకరణ చేయటం సాధ్యం కాదన్నారు.
 
రాష్ట్ర స్దాయి శిక్షణ కార్యక్రమన్ని పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకుని జిల్లా, డివిజన్, మండల స్థాయిలో తిరిగి శిక్షణ కార్యక్రమల్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, అర్ఓఅర్ చట్టం, నియమ భరితంగా క్రమబద్దీకరణ విధానం తదితర అంశాలను భూ చట్టాల నిపుణులు, న్యాయవాది సునీల్ తెలియజేశారు. సాదాబైనామాపై వచ్చిన కోర్టు తీర్పులను న్యాయవాది సురేష్ వివరించారు. భూపరిపాలన సంయిక్త కార్యదర్శి జి గణేష్ కుమార్, గుంటూరు సంయుక్త కలక్టర్ జి.రాజకుమారి, సిఎంఆర్ ఓ పిడి పి. రచన, సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ విఎస్ఎన్ కుమార్, నల్సార్ లా యూనివర్సిటీ ఆచార్యులు, హైకోర్టు పాల్గొన్నారు.