మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 జూన్ 2022 (18:51 IST)

వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రీసర్వే పూర్తి చేయటమే లక్ష్యం: అజయ్ కల్లాం

Meeting
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పధకాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం అన్నారు. క్షేత్ర స్ధాయిలో ప్రతి ఒక్క అధికారి సమర్ధవంతంగా పనిచేసినప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రాధన్యతాంశాలలో కీలకమైన భూసర్వే ప్రాజెక్టుపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు.

 
కాకినాడ, కోనసీమ, ఏలూరు, తిరుపతి జిల్లాల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాలకు సంబంధించిన సంయుక్త కలెక్టర్లు, ఆర్డిఓలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు, మెబైల్ మేజిస్ట్రేట్స్, తాహసీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓలు ఈ సమావేశానికి హజరుకాగా, తమ జిల్లాలలో పరిధిలో జరుగుతున్న సర్వే పనులు సమగ్ర నివేదికలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అజయ్ కల్లాం మాట్లాడుతూ గడిచిన వంద సంవత్సరాలలో ఏ ప్రభుత్వమూ చేపట్టిని అతి పెద్ద కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారన్నారు.

 
రీ-సర్వే వెయ్యికి పైగా గ్రామాల్లో దాదాపు పూర్తి అయ్యిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా శాఖ ప్రధాన కమీషనర్ సాయిప్రసాద్ అన్నారు. తొలుత 51 గ్రామాల్లో తదుపరి 572 గ్రామాల్లో రీ-సర్వే పూర్తికాగా, ఆ గ్రామాల్లో పాత రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని కొత్త భూమి రికార్డులు అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించి సరిహద్దులు నిర్ణయించామన్నారు. సర్వే సెటిల్మెంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్‌ రెవెన్యూ రికార్డులు రూపొందగా, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ స్థానంలో భూ కమతాల మ్యాప్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ స్థానంలో రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్ తీసుకువచ్చామన్నారు. నూతనంగా 1బి రిజిస్టర్, అడంగల్‌ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయన్నారు.

 
తాజా వివరాలు, తాజా భూ యజమానుల వివరాలతో ఇవన్నీ నమోదయ్యాయి. ప్రతి ల్యాండ్‌ బిట్‌కు త్వరలో ఆధార్‌ తరహాలో ఒక విశేష గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నామన్నారు. మరో 100 గ్రామాల్లో రీ-సర్వే తుది దశకు చేరుకోగా, ఈ మహా యజ్ఞాన్ని 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సిద్దార్ధ జైన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో హైబ్రిడ్‌ తరహాలో సర్వే సాగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు శ్యామ్యూల్, భూపరిపాలనా శాఖ ప్రధాన కమీషనరేట్ కార్యదర్శి అహ్మద్ బాబు, సంయుక్త సంచాలకులు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.