గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:03 IST)

టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు... చంద్రబాబు నిర్ణయం!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడుకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందులోభాగంగా, పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి పేరును ఖరారు చేసినట్టు సమాచారం. 
 
టీడీపీ జాతీయ పార్టీకి ఎదిగిన తర్వాత తెలంగాణ, ఏపీలకు వేర్వేరు అధ్యక్షులు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఏపీకి కళా వెంకట్రావు ఉండగా, తెలంగాణకు రమణ ఉన్నారు. 
 
అయితే, ఇపుడు కొత్త కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు పూర్తయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. 
 
ఈ నెల 27న అచ్చెన్న నియామకానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. 
 
పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లడంలో అచ్చెన్న సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.