శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (22:44 IST)

చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానం మొద‌లైన చోటుకే చేరింది....

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానం ఎక్క‌డ మొద‌లైందో తిరిగి అక్క‌డికే చేరుకుంద‌ని జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు మేం రైలు ప్ర‌యాణం చేస్తుంటే, ప‌ద‌వి కోసం చంద్ర‌బాబు ఢిల్లీ ప్ర‌యాణం చేస్తున్నార‌న్నారు. శుక్ర‌వారం విజ‌యవాడ‌-తుని మ‌ధ్య రైలులో ప్ర‌యాణించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తోపాటు మీడియాతో త‌న అభిప్రాయాలు పంచుకున్నారు. 
 
ఆయన మాట్లాడుతూ “2014 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌డానికి గ‌ల బ‌ల‌మైన కార‌ణాల్లో ఒక‌టి, లా అండ్ ఆర్డ‌ర్‌ని బ‌లంగా అమ‌లు చేస్తార‌న్న న‌మ్మ‌క‌మే. అయితే టీడీపీ శాంతి భ‌ద్ర‌త‌ల‌ని పూర్తిగా విస్మ‌రించింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గారిపై దాడి కేసు విచార‌ణ‌ పోలీసుల‌కి వ‌దిలేసి ఉంటే, ఇప్ప‌టికే దోషులెవ‌రో తేలిపోయి ఉండేది. ఈ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ జోక్యం పెరిగిపోయింది. అంతా క‌ల‌సి గంద‌ర‌గోళం సృష్టించి అస‌లు నిజాన్ని బ‌య‌టికి రాకుండా చేశారు. ప్ర‌భుత్వం కావాల‌నే ఇలా చేయిస్తుందా అన్న అనుమానం క‌లుగుతోంది. 
 
నా పైనా ఏలూరు, ప‌లాస‌ల్లో దాడికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ధ‌వ‌ళేశ్వ‌రం క‌వాతుకు జ‌నం భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో, ప్ర‌భుత్వం ఇబ్బందులు పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీలు త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ పోవ‌డం వ‌ల్ల జ‌న‌సేన అవ‌స‌రం వ‌చ్చింది. నా అంతిమ ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి పీఠం కాదు. రాష్ట్ర ప్ర‌జ‌లు రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు కోరుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో మార్పు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని అన్నారు. 
 
సేనాని రైలు ప్రయాణం సాగిందిలా..
విజ‌య‌వాడ నుంచి తుని రైలు ప్ర‌యాణంలో భాగంగా నూజివీడు స్టేష‌న్లో రైలు ఎక్కిన మామిడి రైతుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మామిడి రైతులు జ‌న‌సేనాని ముందు క‌ష్టాల‌ను ఏక‌రువు పెట్టారు. ఫలాల్లో రారాజుగా పేరొందిన మామిడికి కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం ఎంతో ప్రసిద్ధని, చెట్లకు పాదులు వేయడం, కొమ్మ కత్తిరింపు, ఎరువుల వాడకం, పురుగు మందుల పిచికారితో పాటు కూలీలకు మొత్తం కలిపి ఒక్కో ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖ‌ర్చు అవుతుంద‌ని, పంట‌కు మాత్రం గిట్టుబాటు ధ‌ర లేక న‌ష్ట‌పోతున్నామ‌ని వాపోయారు. 
 
నూజివీడు శివారులో ఏర్పాటు చేసిన మామిడి పరిశోధనా కేంద్రం రైతులకు అంతంత మాత్రంగానే ఉపయోగపడుతోంద‌ని, అధికారులుగానీ, శాస్త్రవేత్తలుగానీ పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పండ్ల రసం, ఒరుగులు, పచ్చళ్లు, తాండ్ర తయారీకి సంబంధించిన పరిశ్రమలు, యూనిట్లు ఈ ప్రాంతంలో నెలకొల్పితే రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. రైతుల స‌మ‌స్య‌లు విన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నేను కూడా రైతునే అని పండించే పంట‌కు గిట్టుబాటు ధ‌ర వ‌చ్చేలా చేయ‌డంతో పాటు అనుబంధ కంపెనీలు ఏర్పాటుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. 
 
అనంత‌రం తాడేప‌ల్లిగూడెం స్టేష‌న్ లో రైలు ఎక్కిన‌ చెరకు రైతులతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. చెర‌కు రైతు ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంద‌ని, నానాటికీ పెట్టుబడుల వ్యయం పెరిగిపోతూ వస్తోందని, దీనికి తోడు వర్షపాతంలో లోతు పాట్లు రైతును వేధిస్తున్నాయ‌ని చెర‌కు రైతులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి చెప్పారు. ఎక‌రాకు రూ.ల‌క్షా 50వేలు ఖ‌ర్చ‌యితే రూ.ల‌క్షా 20 వేలు రావ‌డం కూడా క‌ష్టంగా ఉంద‌ని, దీనికి తోడు చెర‌కు ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యాలు బ‌కాయిలు చెల్లించ‌కుండా రైతుల‌ను వేధిస్తున్నాయ‌ని వాపోయారు. న‌ష్టాల పేరుతో చాగ‌ల్లు సుగ‌ర్ ఫ్యాక్ట‌రీ మూసేశార‌ని, దానిని తెరిపించాల‌ని విన్న‌వించారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చెర‌కు రైతుల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. 
 
అనంత‌రం శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల నుంచి రాజ‌మండ్రికి వ‌ల‌స వ‌చ్చిన కూలీలతో ప‌వ‌న్ మాట్లాడారు. రాజ‌మండ్రి, అన్న‌వ‌రం స్టేష‌న్ల మ‌ధ్య వారి స‌మ‌స్య‌లను జ‌న‌సేనానికి విన్న‌వించారు. రాజ‌మండ్రికి వ‌ల‌స వ‌చ్చి 40 ఏళ్లు దాటినా ఇప్ప‌టికీ మాకు ఇళ్ల స్థ‌లాలు కానీ, పెన్ష‌న్ గానీ ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఇళ్లు, పెన్ష‌న్లు ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌డం త‌ప్పితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది ఏమీ లేద‌ని చెప్పారు.  వారి స‌మ‌స్య‌లు విని చ‌లించిపోయిన ఆయన జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే శారీర‌క శ్ర‌మ చేసే కూలీల‌కు 58 ఏళ్ల‌కే పెన్ష‌న్ వ‌చ్చేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప‌క్షి కూడా గూడు ఉండాల‌ని కోరుకుంటుంద‌ని, మ‌నం మ‌నుషుల‌మ‌ని మ‌న‌కు ఇళ్లు ఉండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేద‌ని, వ‌ల‌సలు పేరు చెప్పి ఇళ్లు కేటాయించ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. 
 
అన్న‌వ‌రం రైల్వే స్టేష‌న్లో రైలు ఎక్కిన ఏటికొప్పాక కొయ్య బొమ్మ‌ల క‌ళాకారులు ఆయనకి త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించారు.  ఏటికొప్పాక కొయ్య బొమ్మలకు 400 ఏళ్ల చ‌రిత్ర ఉంద‌ని, దేశ విదేశాల్లో బొమ్మలకు మంచి గిరాకీ ఉందని, అయితే పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల కొయ్య బొమ్మ‌లు క‌ళ త‌ప్పుతున్నాయ‌ని వాపోయారు. కొయ్య బొమ్మలకు అంకుడు కర్ర ముడి సరుకు అనీ, అడవినిండా ఇది దొరుకుతున్నా అధికారులు అడ్డుపడుతున్నారు. దీంతో చాలామంది క‌ళాకారులు కంపెనీల్లో కూలీ ప‌నుల‌కు వెళ్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెక్క, లక్కపై సబ్సిడీ ఇవ్వాలని విన్న‌వించారు.
 
జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్లాంటేషన్ నుంచి మార్కెటింగ్ వ‌ర‌కు ప్ర‌భుత్వమే చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తే ఈ ప్రాచీన క‌ళ బ‌తుకుతుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.  ప్రాచీన క‌ళ‌ను కాపాడుకునేందుకు క‌ళాకారుల‌కు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, అధికారంలోకి వ‌స్తే చెక్క‌, ల‌క్క‌ల‌పై స‌బ్సిడీ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. వీరితో పాటు విద్యార్ధులు, సామాన్య ప్ర‌యాణికులు, రైల్వే వెండ‌ర్స్ ప‌వ‌న్ కల్యాణ్ గారిని క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించారు.