టీడీపీ అంతిమ లక్ష్యం అధికారమే… అన్యాయం చేసిన పార్టీతో స్నేహమా?
రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మీద చాలా కోపంతో ఉన్నారనీ, ఆ కోపాన్ని వచ్చే ఎన్నికల్లో చూపించబోతున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం విజయవాడ-తుని మధ్య రైలు ప్రయాణంలో పలువురు పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా రాష్ట్ర విభజన దగ్గర నుంచి తాజా రాజకీయ పరిణామాల వరకు తన అభిప్రాయాలని వెల్లడించారు.
మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయి. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉంది. సమగ్రమైన కసరత్తు చేయకుండా తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో కొన్ని లక్షల మందికి బీసీ స్టేటస్ పోయింది. నేను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగు దేశం పార్టీ వాళ్ళు నన్ను వ్యతిరేకించారు. హోదాపై అప్పుడు వాళ్ళు పెదవి విప్పలేదు. ఇప్పుడు వారి వ్యక్తిగత లాభం కోసం బీజేపీని వ్యతిరేకించారు.
ఓట్ల రాజకీయాలే చేస్తారు
తెలుగుదేశం పార్టీ కేవలం ఓట్ల రాజకీయాలు మాత్రమే చేస్తుంది. రాష్ట్రానికి జరిగే అన్యాయం వారికి పట్టదు. వారికి అధికారం చేతిలో ఉంటే చాలు. ముఖ్యమంత్రి గారు తన వ్యక్తిగత ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశారు. ఆ కలయిక ప్రజలకి అవసరం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారికి అధికార దాహం మినహా ప్రజా సంక్షేమం పట్టదు. పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు.
ఎక్కడ వస్తున్నాయి. కేవలం లక్షల కోట్ల అప్పులు మాత్రమే వస్తున్నాయి. ఆ అప్పుల భారం మళ్లీ ప్రజల మీద వేస్తారు. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు వినియోగించుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి పని చేసినా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బలమైన సంస్థాగత మార్పు తీసుకురావడానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇష్టారాజ్యంగా ప్రజలకి హామీలు ఇచ్చి అమలు చేయకపోతే, ప్రజల ముందుకి వచ్చి చేయలేను అని ఒప్పుకుని తీరాలి.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటికి వచ్చా. ప్రజల ముందుకి కూడా ఎన్నో రకాలుగా రావాలి అనుకున్నా, జనం తోపులాటలో నలిగిపోవడం ఇష్టం లేక చాలా సందర్భాల్లో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నా. నాలుగు గోడల మధ్య కూర్చుని పాలసీలు రాయడం జనసేన లక్ష్యం కాదు. ప్రజల మధ్యకి వచ్చి, వారితో మమేకమవుతూ, వారి బాధలు తెలుసుకుంటూ ముందుకి సాగాలన్న లక్ష్యంతోనే ఈ రైలు ప్రయాణం. టీడీపీ అంతిమ లక్ష్యం అధికారం అయితే, జనసేన పార్టీ అంతిమ లక్ష్యం మాత్రం మార్పు. స్వప్రయోజనాల కోసం ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు. లక్షల ఓట్లు తీసేశారు. గడచిన నెల రోజుల్లో జనబాట కార్యక్రమం ద్వారా 23 లక్షల ఓట్లు ఎన్‌రోల్ చెయ్యగలిగాం. ఎక్కడో ఒకచోట మార్పు రావాలన్న లక్ష్యంతోనే ప్రజల్లోకి వచ్చాను” అన్నారు.