శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:27 IST)

కలెక్షన్ కింగ్ కొడుకు ఎలక్షన్లలో ఏ పార్టీ తరపున పోటీ? స్కూళ్లకు వెళ్తున్నాడే...

అతనిదో విభిన్నశైలి. డిఫరెంట్ క్యారెక్టర్. వివాదాలు పుట్టించే ఫ్యామిలీలో ఉన్నప్పటికీ తాను మాత్రం వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. తండ్రి నట వారసత్వాన్ని తీసుకున్న అతను కొంతలో కొంతైనా దానికి న్యాయం చేయగలుగుతున్నాడు. అయితే ఉన్నఫలంగా ఆయన మరో కొత్త క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. దానికి అర్థం.. పరమార్థం ఏమున్నాయో కానీ ప్రస్తుతానికి అయితే ప్రజల కోణంలో తన ప్రయాణం మొదలవుతుందంటున్న ఆ నటుడు ఎవరు.. ఉన్న ఫలంగా ఆయనలో వచ్చిన ఈ మార్పుకు కారణమేంటి. 
 
మంచు ఫ్యామిలీ. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్. సినిమా నటుడిగా, హీరోగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి మంచు మోహన్ బాబు. ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే ఆయన మాటలు అంత ముక్కుసూటిగా ఉంటాయి. నిజాలు ఒప్పుకోవాలన్నా, ఎదుటివారి తప్పులను కడిగి పారేయాలన్నా మోహన్ బాబుకే చెల్లు. ఇండస్ట్రీలో మోహన్ బాబు లాంటి ఒక వెరైటీ పర్సన్. ఎంత ఆవేశంగా కనిపిస్తారో అంతకంటే మించి మంచి స్నేహాన్ని నేర్పగలరు మోహన్ బాబు. 
 
తన సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన మోహన్ బాబు నిజజీవితంలో కూడా అంతే వైవిధ్యంగా కనిపిస్తారు. అయితే మోహన్ బాబు వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అందులో మొదటగా వినిపించిన పేరు ఆయన కూతురు మంచు లక్ష్మి. మంచు లక్ష్మి టిడిపి నుంచి గానీ, వైసిపి నుంచి గానీ పోటీ చేయబోతోందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే వాటిని వాళ్లు ఏ రోజు ఖండించిపోయినప్పటికీ పెద్దగా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. 
 
మోహన్ బాబు ఫ్యామిలీ మళ్ళీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవ్వబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. తండ్రిలాగే సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మనోజ్ ఉన్న ఫలంగా ప్రజా సమస్యలపై పోరాడతానంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకం సమస్యలపై పోరాడుతానంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు దీనిపై చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. ట్వీట్ చేసిన మరుసటి రోజే చంద్రగిరి సమీపంలోని తన విద్యాసంస్థలకు వచ్చిన మంచు మనోజ్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇదంతా చూస్తే ఒక రాజకీయ వాతావరణాన్ని తలపించింది. 
 
మంచు మనోజ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారా. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా. ఒకవేళ రావాలంటే ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది. తన పూర్తిస్థాయి నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ ఒకవైపు సినిమాల్లో తనకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడతానంటున్నారు మంచు మనోజ్. గతంలో తన తండ్రిలాగే అటు సినిమాలోను, అటు పాలిటిక్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ మనోజ్ ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
తనకున్న అభిరుచిని కుటుంబ సభ్యులతో పంచుకున్న తరువాతే మనోజ్ ట్వీట్ చేశారంటున్నారు అభిమానులు. ఏ హీరో అయినా రాజకీయాల్లోకి వస్తాము అనుకున్నప్పుడు తమ అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మనోజ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరోగా మిమ్మల్ని ఏ విధంగా అయితే అభిమానించామో భవిష్యత్తులో ప్రజా సమస్యల పోరాటంలో కూడా మనోజ్‌కు అదేవిధంగా అండగా ఉంటామంటున్నారు అభిమానులు. మనోజ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి అనేది భవిష్యత్తులో ఆయన వేయబోయే అడుగులను బట్టి తెలుస్తుంది. ఒక బాధ్యత తీసుకున్న తరువాత ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని మోహన్ బాబు మంచు మనోజ్‌కు దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.