జనసేనలోకి చదలవాడ... ఆహ్వానించిన పవన్ కల్యాణ్...
గత కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా పార్టీలో చేరారు. చదలవాడతో పాటుగా పార్టీలో చేరిన వారందరికీ పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా చదలవాడ కృష్ణమూర్తి చేరికతో పార్టీ మరింత బలం పుంజుకోవటంతో పాటుగా జనసేనలోకి భారీగా చేరికలు ఊపందుకుంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చదలవాడ పార్టీలో చేరిన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చదలవాడ జనసేనలో చేరడం శుభపరిణామమన్నారు.
పార్టీకి సీనియర్ల అవసరం ఎంతో ఉందని, తమ కుటుంబానికి, చదలవాడ కుటుంబానికి ఎన్నోఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. విపత్కర సమయాల్లో పార్టీకి ఇటువంటి పెద్దల అండ అవసరమని, చదలవాడను వెంకన్నకు ప్రతినిధిగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. జనసేన విధానాలు, పవన్ కల్యాణ్ దృక్పథం నచ్చి పార్టీలో చేరినట్లు చదలవాడ చెప్పారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి తవవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.