శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (20:48 IST)

జగన్‌పై దాడి కేసులోఆ నటుడిని విచారించనున్న ఎన్‌ఐఏ

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం వినామాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ కీలక వ్యక్తిని విచారించనుంది. ప్రతిపక్ష నేతపై దాడి జరుగబోతోందని కొన్ని నెలల ముందే చెప్పిన సినీ నటుడు శివాజీని విచారించడానికి ఎన్‌ఐఏ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. శివాజీ నుంచి సమాచారం రాబట్టగలిగితే ఈ కేసులోని మిస్టరీ మొత్తం వీడిపోతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.
 
రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించే కుట్రతో ఢిల్లీలోని జాతీయ పార్టీ ఆపరేషన్‌ గరుడకు శ్రీకారం చుట్టినట్లు శివాజీ గత ఏడాది మార్చిలో చెప్పిన సంగతి తెలసిందే. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి జరుగుతుందని శివాజీ చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే మూడు నెలల క్రితం జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో కోడి పందేలకు వాడే కత్తితో హత్యాయత్నం చేశారు.
 
ఈ కేసు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులతో కూడిన సిట్‌(స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) శివాజీని ఎందుకు పిలిచి విచారించలేదనే వాదనలు మొదలయ్యాయి. సాధారణంగా నేరాలను ఛేదించడానికి క్లూస్‌ సంపాదించడం కోసం పోలీసులు చాలా అవస్థ పడుతుంటారు. అటువంటిది శివాజీ రూపంలో కనిపిస్తున్న క్లూ గురించి సిట్‌ ఎందుకు పట్టించుకోలేదని అంటున్నారు.
 
శివాజీని విచారించాలని కొందరు చెబితే…. తనకు తెలిసిన సమాచారం చెప్పడం శివాజీ చేసిన నేరమా? అంటూ కొందరు నేతలు అడ్డంగా వాదించారు. బయటకు చెప్పడం నేరం కాదుగానీ…. కుట్ర చేసినది ఎవరో తెలిసీ పోలీసులకు చెప్పకపోవడం నేరమే అవుతుంది. అసలు విచారిస్తేగదా తెలిసేది…. ఆయనకు ఎలా తెలుసో, ఎవరు చెప్పారో, నిజానిజాలు ఏమిటో తెలిసేది!
 
తనపై హత్యాయత్నం కేసు విచారణ సక్రమంగా జరగలేదని జగన్‌ మోహన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, న్యాయస్థానం జోక్యంతో ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును ఐదు రోజుల పాటు విచారించిన ఎన్‌ఐఏ…. ఇప్పుడు మిగతా అంశాలపై దృష్టి పెట్టింది. శ్రీనివాసరావు ఎవరెవరితో మాట్లాడారు అనే వివరాలను కాల్‌ డేటా ద్వారా సేకరించి సంబంధిత వ్యక్తుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయనుంది. అదేవిధంగా శ్రీనివాసరావును పనిలో పెట్టుకుని విమానాశ్రయంలోని రెస్టారెంట్‌ అధినేత హర్షవర్ధన్‌ చౌదరిని కూడా విచారించబోతోంది.
 
ఈ క్రమంలో…. దాడి జరగబోతున్నట్లు కొన్నినెలల ముందుగానే చెప్పిన శివాజీని కూడా పిలిచి విచారించాలన్న నిర్ణయానికి ఎన్‌ఐఏ వచ్చినట్లు సమాచారం. దాడి సమాచారం తనకు ఎలా తెలిసిందో తెలుసుకునేందుకు శివాజీని అన్ని కోణాల నుంచి ఎన్‌ఐఏ ప్రశ్నించనుంది. ఇందుకోసం ఈ రోజో రేపో ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. శివాజీని విచారించడం ద్వారా ఈ కేసులోని చిక్కుముడిని విప్పవచ్చన్న ఆశాభావంతో ఎన్‌ఐఏ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఒకవేళ శివాజీని పిలిస్తే ఏం చెప్తారో చూడాలి.