మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (14:36 IST)

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన కేంద్ర విమానయాన శాఖ

ayyappa deeksha
అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. తమతో పాటు అయ్యప్ప భక్తులు కూడా ఇరుముడి వెంట తీసుకుని వెళ్లొచ్చని కేంద్ర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీంతో అనేక మంది భక్తులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. 
 
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలించడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే భద్రత నిమిత్తం స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.
 
మండలం నుంచి మకర జ్యోతి దర్శనం (జనవరి 20) వరకూ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి కూడా అయ్యప్ప భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో తరలించే వారు. 
 
ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తుల ఇబ్బందులు తెలుసుకున్న మంత్రి రామ్మోహన్ నాయుడు అయ్యప్ప దీక్షా స్వాముల ఇరుముడికి సంబంధించి నిబంధనలను సడలించారు. ఈ విషయాన్ని మంత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. అయ్యప్ప భక్తులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నారు.