సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అరెస్టు - 14 రోజుల రిమాండ్

btech ravi
కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పులివెందుల పోలీసులు మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో హైడ్రామా మధ్య అరెస్టు చేశారు. పది నెలల క్రితం జరిగిన  ఓ ఘటనపై బీటెక్ రవిపై పోలీసులు కేసు నమోదు చేసి వున్నారు. ఈ కేసులో ఆయనను పది నెలల తర్వాత అరెస్టు చేయడం గమనార్హం. ఆ తర్వాత అనేట నాటకీయ పరిణామాల మధ్య ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 
 
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25వ తేదీన కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. బీటెక్ రవి వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి కడప వస్తుండగా నంది మండలం వరకు ఫోనులో అందుబాటులో ఉన్నారు. తర్వాత ఆయనతోపాటు.. డ్రైవరు, గన్‌మెన్, ఇతర సహాయకుల ఫోన్లు సైతం పని చేయలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఇంతలోనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఎదుట మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు గంట తర్వాత పోలీసుల అదుపులో ఉన్న గన్‌మెన్లు, డ్రైవర్, వ్యక్తిగత సహాయకులను వదిలిపెట్టి అందరి ఫోన్లను తిరిగిచ్చారు. దీంతో అదుపులోకి తీసుకున్నది పోలీసులేనని కుటుంబసభ్యులకు తెలిసింది. తర్వాత రవిని వల్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రాత్రి 10 గంటలకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు.