గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మోడీ చెంతకు బాబు.. మళ్లీ ఎన్డీయేలో చేరనున్న టీడీపీ!?

Chandrababu-Modi
ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య మళ్లీ కొత్త స్నేహం చిగురించినట్టుగా కనిపిస్తుంది. దీంతో బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతున్నట్టు రిపబ్లికన్ టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అయితే, ఈ టీవీ బీజేపీకి అనుకూల ఛానెల్. దీంతో ఈ కథనం నిజమైవుండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అటు తెలంగాణాలో ఏకంగా 20 శాతం మేరకు ఓటు బ్యాంకును కలిగివుంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలన్న సానుకూల ధోరణితో బీజేపీ అగ్రనేతలైన ప్రధాన మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఉన్నట్టు ఆ టీవీ కథనంలో పేర్కొంది. 
 
కాగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన "ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌"లో ప్రధాని మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరచాలం చేసారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఐదు నిమిషాల పాటు చర్చ జరిగింది. అలాగే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థికి టీడీపీ జై కొట్టింది. ఆగస్టు 15న టీడీపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బాబు... ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పరిణామాలన్నీ టీడీపీ - బీజేపీల మధ్య మళ్లీ చెలిమి చిగురించేలా చేశాయని పేర్కొంది.