శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (09:01 IST)

నేడు ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల... హాజరుకానున్న బాబు - నడ్డా

ntramarao
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్లో భాగంగా, ఆయన బొమ్మతో కూడిన రూ.100 నాణెంను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి 200 మంది అతిథులు హాజరువుతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారు. ఈ నాణెంను రాష్ట్ర ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. 
 
సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగే కార్యక్రమంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరవుతున్నారు. 
 
టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్‌ వెన్నంటి ఉన్న అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం తదితర సీనియర్‌ నాయకులు, సినీ నిర్మాతలు చలసాని అశ్వినీదత్‌, దగ్గుబాటి సురేశ్‌, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యతోపాటు సుమారు 200 మంది దాకా అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం.
ntr coin
 
ఇందుకోసం చంద్రబాబు, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్‌ స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది. 
 
దీనిపై మార్చి 20న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల లఘుచిత్రాన్ని రాష్ట్రపతి ముందు ప్రదర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక నాణేన్ని విడుదల చేస్తారు.