శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 జులై 2024 (20:39 IST)

బిసిల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి: బిసి సంక్షేమ శాఖ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత

Minister Savitha
బడుగు, బలహీన వర్గాల ద్రోహిగా వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అభివర్ణించారు. నా బిసి, నా బడుగులని ఓట్లు వేయించుకొని బీసీలను అన్ని రంగాలలో మోసం చేశారని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే అని మంత్రి పునరుద్ఘటించారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్‌ను గౌరవ బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం బీసీలు ఉన్నారని, టిడపి ప్రభుత్వం బిసిల అభివృకి పెద్దపీట వేసిందన్నారు. 2019 ఎన్నికల్లో నా బిసి, నా బడుగు అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి బిసి కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా అణగదొక్కారన్నారు.
 
గొప్పల కోసం కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ, కార్పొరేషన్లకు నిధులు కానీ విధులు కానీ లేవన్నారు. కనీసం కుర్చోవడానికి కుర్చీలు కూడా కేటాయించలేకపోయిందని తెలిపారు. బిసిల బాగు కోసం పనిచేయాల్సిన కార్పొరేషన్ చైర్మన్లు విధులు తమ బాధ్యతలు నిర్వహించకుండా జీతాలు తీసుకొని వైసిపి కార్యకర్తల్లా పనిచేశారన్నారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తనపై నమ్మకంతో 50 శాతం జనాభా ఉన్న బీసీల సంక్షేమ బాధ్యతను అప్పగించారని, వారి సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బిసిలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి తెలిపారు. మంత్రి పర్యటనలో బిసిఎండి సిహెచ్ కిశోర్, జనరల్ మేనేజర్ బీమ్ శంకర్, టిడిపి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పాల్గొన్నారు.