శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (18:34 IST)

కరోనా చికిత్స కేంద్రంగా బెజవాడ: ప్రభుత్వం నిర్ణయం

కృష్ణా జిల్లాలో రోజురోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పేదలకు ఓపీ సేవలతోపాటు సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రి, డయాలసిస్‌.. ఇలా అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన విజయవాడ కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వ్యాధి చికిత్సా కేంద్రంగా (కరోనా ఆసుపత్రి)గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

1050 మంచాలతో కూడిన ఈ పెద్దాసుపత్రిలో ఇక నుంచి పూర్తిగా కరోనా వైరస్‌ బాధితులకు మాత్రమే వైద్యసేవలందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ ఆయా విభాగాల్లో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల్లో ఆరోగ్యం మెరుగుపడిన వారిని డిశ్చార్జి చేసి ఇంటి దగ్గరే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం సాయంత్రానికే కొన్ని వార్డులు ఖాళీ అయిపోయాయి. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న రోగులను మాత్రం అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వారికి అక్కడ వైద్యసేవలను కొనసాగించనున్నారు. డయాలసిస్‌ అవసరమైన రోగులు కూడా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందే. 
 
విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ దాదాపు రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. ఇలా వచ్చే వారికి నగరంలోని పటమట, కొత్తపేట, రాజీవ్‌నగర్‌ల్లో ఉన్న అర్బన్‌ ఫ్యామిలీ హెల్త్‌ సెంటర్లలో ఓపీ సేవలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనంగా ప్రత్యేక అల్లోపతి డిస్పెన్షరీ ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 
 
ఈ నాలుగు హెల్త్‌ సెంటర్లకు వచ్చే ఓపీ పేషెంట్లలో ఎవరికైనా ఎమెర్జెన్సీ వైద్యసేవలు, శస్త్రచికిత్సలు అవసరమైతే వారిని అంబులెన్స్‌ల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యసేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వారు చెబుతున్నారు.

విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చేస్తున్నందున ఇక నుంచి కరోనా పాజిటివ్‌, ఆ వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందించనున్నారు.

కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని సగభాగం నుంచి కరోనా కేసులను విజయవాడ ప్రభుత్వాసుపత్రి (కరోనా ట్రీటింగ్‌ సెంటర్‌)కి తీసుకువచ్చి ఇక్కడ చికిత్స అందిస్తారని వైద్య అధికారులు చెబుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలు.యథావిధిగా కొనసాగనున్నాయి.