అర్థరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్, 21 రోజులు కొనసాగింపు, కరోనా అంతానికి ఇదే మందు
కరోనా (కొవిడ్-19) వైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధ రాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ 21 రోజులు కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రావడాన్ని పూర్తిగా నిషేధించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు.
దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ గురించి తెలిసిందే. అయితే ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి రాను రాను తీవ్రమవుతోందని ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోదీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 3,78,679 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 16,500 మంది మృతి చెందారు.
కాగా ఈ కేసులపై నరేంద్రమోదీ ఒక విశ్లేషణ చేశారు. మొదటి లక్ష మందికి కరోనా వ్యాపించడానికి 67 రోజుల సమయం పట్టిందని, తర్వాతి లక్ష మందికి కరోనా వ్యాపించడానికి 11 రోజుల సమయం పట్టిందని, మరో లక్ష మందికి కరోనా వ్యాపించడానికి 4 రోజుల సమయమే పట్టిందని మోదీ అన్నారు.
వైరస్ వ్యాప్తి మొదట్లో తక్కువగానే ఉందని, రోజులు గడిచినా కొద్ది వేగం పెంచుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం భారతదేశం మొదటి దశలో ఉందని, మనమేమాత్రం ఏమరపాటుగా ఉన్నా కరోనా వ్యాప్తి వేగం పెరుగుతుందని అన్నారు. సంకట సమయంలో దేశమంతా ఏకమైందని, ఇదే ఐక్యతతో కరోనాపై పోరాడదామని మోదీ అన్నారు. కరోనా పారదోలేందుకు దేశ ప్రజలంతా ఏకమవ్వాలనీ, ఈ కార్యాన్ని దిగ్విజయం పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాని అన్నారు.