1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (16:50 IST)

వైకాపా ఎమ్మెల్యేలకు "గడప గడప"లోనూ చుక్కలు చూపిస్తున్న ప్రజలు

avanthi srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపొంది అధికారంలోకి వచ్చేందుకు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జనగ్మోహన్ రెడ్డీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గడప గడపకు వైకాపా పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 
 
తమ ప్రాంతాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైకాపా నేతలను మహిళలు నిలదీస్తున్నారు. చుట్టపుచూపుగా వచ్చి వెళ్తారంటూ ముఖాన్నే అడుగుతున్నారు. పైగా, గత మూడేళ్ళలో ఒక్క సమస్య కూడా పరిష్కరించేలేదని, ఒక్క రోడు కూడా వేయలేంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన గడప గడపకు ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)కు ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలు చుక్కలు చూపించారు. నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండలం పెద్దిరెడ్డి పాలెం గ్రామానికి ఆయన వెళ్లగా గ్రామప్రజలంతా సమస్యలను ఏకరవు పెడుతూ చుట్టుముట్టారు. 
 
ఈ సందర్భంగా ఓ మహిళ అవంతి శ్రీనివాస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో కార్యక్రమం పేరిట వస్తారు.. వెళ్తారు.. మరి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు.. చుట్టుపుచూపుగా వచ్చి వెళితే సరిపోతుందా? అంటూ నిలదీశారు. దీంతో ఆ మహిళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు విగ్రహంలా నిలబడిపోయారు.