శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (09:23 IST)

రక్తమోడిన కాబూల్‌ - బాంబు పేలి 66 మంది మృతి

bomb blast
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 66 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఖలీసా సాహిబ్ మసీదుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ ఉగ్రవాది మానవబాంబుగా మారి తనను తాను పేల్చుకున్నాడు. 
 
అప్పటివరకు ఎంతో కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారికాగ రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సున్నీ తెగకు చెందిన ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. శనివారం ఉదయం వరకు 66 మంది చనిపోయారు. మరో 78 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
అయితే, ఈ మానవబాంబు పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థా నైతిక బాధ్యత వహించలేదు. పేలుడుపై ఆప్ఘన్ భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మసీదు వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది.