బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:57 IST)

కాందహార్‌ సిటీలో బాంబు పేలుళ్లు : 32 మంది మృత్యువాత

ఆప్ఘనిస్థాన్ దేశంలోని కాందహార్ సిటీలో శుక్రవారం బాంబు పేలుళ్లతో బీభత్సం జరిగింది. సిటీలో షియా తెగకు చెందిన అతి పెద్ద మసీదు అయిన ఇమామ్ బర్గా మసీదులో వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 32 మంది మరణించగా.. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
వరుసగా మూడు బాంబు పేలుళ్లు జరిగాయని, మొదట మెయిన్‌ డోర్ దగ్గర, ఆ తర్వాత మసీదులో దక్షిణ భాగంలో, మూడోది ప్రార్థనలకు ముందు కాళ్లు కడుక్కునే చోట బ్లాస్ట్స్ జరిగాయని ప్రత్యక్ష సాక్షి తెలిపినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఏ ఒక్క తీవ్రవాద సంస్థ కూడా నైతిక బాధ్యత వహించలేదు 
 
షియా తెగ ముస్లింల శుక్రవారం ప్రార్థనలను టార్గెట్ చేసి ఉగ్ర మూకలు అఫ్గాన్‌లో ఇలా బాంబు దాడులకు పాల్పడడం ఇది వరుసగా రెండో వారం. గత శుక్రవారం కుందుజ్ సిటీలో ఓ మసీదుపై ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి, దాదాపు 100 మంది సామాన్యలును బలి తీసుకున్నారు.
 
కాగా, ఈ ఘటనపై తాలిబాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్‌ ఖోస్తీ స్పందించాడు. కాందహార్‌‌లోని షియా మసీదుపై జరిగిన దాడి తమను ఎంతో బాధించిందని పేర్కొన్నాంటూ ట్వీట్ చేశాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు బాధ్యులను పట్టుకుని, శిక్షిస్తామని పేర్కొన్నాడు.