గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (17:14 IST)

కిడ్నాప్ కేసులో ఏ1గా అఖిలప్రియ - బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను బోయిన్‌పల్లిలో కిడ్నాప్ చేసిన కేసులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆమె పేరును ఏ1గా చేర్చారు. ప్రస్తుతం గర్భవతి అయిన ఈమె.. చెంచల్‌గూడ జైలులో ఉన్నారు. 
 
నిజానికి అరెస్టు చేసిన తర్వాత ఆమె పేరును ఏ2గా పేర్కొన్న పోలీసులు గురువారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏ1గా పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆమె న్యాయవాది బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టుకు తెలిపారు. అఖిలప్రియను ఏ2 నుంచి ఏ1గా మార్చారని ఆరోపించారు.
 
ఇక, రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే, బుధవారం ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని తాజాగా ఏ2గా నమోదు చేశారు. ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇతర నిందితులుగా శ్రీనివాసరావు, చంటి, ప్రకాశ్, సాయిల పేర్లు నమోదు చేశారు. హఫీజ్ పేటలోని సర్వే నెంబర్ 80లో ఉన్న 25 ఎకరాల భూమి చుట్టూ నెలకొన్న వివాదమే ఈ కిడ్నాప్‌కు దారితీసిందని పోలీసులు రిపోర్టులో వెల్లడించారు. ఈ భూమి విలువ రూ.500 కోట్లుగా ఉంటుందని అంచనా. 
 
బాధితులు ప్రవీణ్ రావు, ఆయన సోదరులు 2016లో ఈ భూమిని కొనగా, ఆ భూములు తమవేనని అఖిలప్రియ, భార్గవరామ్, సుబ్బారెడ్డి చెప్పుకునేవారని... అయితే సుబ్బారెడ్డికి ప్రవీణ్ వర్గం డబ్బులిచ్చి వివాదాన్ని పరిష్కరించుకుందని వివరించారు. 
 
కాగా, ఆ భూమికి ఇటీవల ధర పెరగడంతో నిందితులు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మరోసారి వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ రావును, ఆయన ఇద్దరు సోదరులు నవీన్, సునీల్‌ను కళ్లకు గంతలు కట్టి కిడ్నాప్ చేశారని పోలీసులు వివరించారు.
 
ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు, ఏవీ సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అతడికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. 
 
ఇకపోతే, అఖిలప్రియకు ఈ వ్యవహారంతో సంబంధంలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా, తనకే పాపం తెలియదని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న భార్గవరామ్, అతడి సోదరుడు చంద్రహాస్ పట్టుబడితే ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న భార్గవ్ కోసం చెన్నై, బెంగుళూరులకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి.