ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:39 IST)

శ్రావణి కేసులో ఆ ముగ్గురే విలన్లు... ఏ1 సాయి.. ఏ2 అశోక్ రెడ్డి...

బుల్లితెర నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసులోని మిస్టరీని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏ1 సాయికృష్ణారెడ్డి, ఏ2గా ఆర్ఎక్స్ నిర్మాత అశోక్ రెడ్డి, ఏ3గా దేవారజ్ రెడ్డిలని పోలీసులు వెల్లడించారు. ఇదే అశంపై డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం సాయంత్రం పూర్తి వివరాలను వెల్లడించారు. 
 
హైదరాబాదులో నటి శ్రావణి ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆమె ఆత్మహత్య నేపథ్యంలో దేవరాజ్ రెడ్డి, సాయి అనే వ్యక్తులు కూడా తెరపైకి వచ్చారు. శ్రావణి స్వస్థలం కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు. అయితే సినిమాలపై ఆసక్తితో ఆమె హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఓ స్నేహితురాలు ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణా రెడ్డి పరిచయం అయ్యాడు. దీనిపై డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అసలు విషయాలు వెల్లడించారు. శ్రావణి రియల్ స్టోరీ ఏమిటో డీసీపీ మాటల్లోనే....
 
కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన కొండపల్లి శ్రావణి సినిమాలపై ఆసక్తితో 2012లో హైదరాబాద్‌కు వచ్చింది అక్కడ ఓ స్నేహితురాలు ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డి 2015లో పరిచయమయ్యాడు. వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు. 2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డి నిర్మించిన 'ప్రేమతో కార్తీక్', 'ఆర్ఎక్స్100' అనే చిత్రంలో శ్రావణి చిన్న పాత్ర పోషించింది. అప్పటి నుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా మెలుగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో 2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డి టిక్ టాక్ ద్వారా పరిచయమయ్యాడు. దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్‌గా ఉండడం సాయికి నచ్చలేదు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో అప్పటినుంచి శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులేకాక, సాయి, అశోక్ రెడ్డి కూడా హెచ్చరించసాగారు. 
 
అయితే దేవరాజ్ రెడ్డి కాల్ డీటెయిల్స్‌ను పోలీసులు విశ్లేషించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటకూడా ఇచ్చాడు. కానీ, ఆమె ప్రవర్తన నచ్చక దూరంగా పెట్టాడు. శ్రావణి తీరు నచ్చక మాట మార్చాడు. దాంతో శ్రావణి మనస్తాపం చెంది తల్లిదండ్రులకు, సాయికి, అశోక్ రెడ్డికి, దేవరాజ్‌కు దూరంగా ఉండడం ప్రారంభించింది.
 
ఈ క్రమంలో సాయి, అశోక్ రెడ్డి, తల్లిదండ్రులు మరింత వేధించసాగారు. సాయి, అశోక్ రెడ్డి తనపై భౌతికదాడులు చేశారని కూడా శ్రావణి ఓ సందేశంలో తెలిపింది. సాయి, అశోక్ రెడ్డిల బెదిరింపులు, దాడులు... తల్లిదండ్రుల ప్రవర్తన.... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన దేవరాజ్ రెడ్డి ఆపై దూరంగా జరగడం... ఇవన్నీ శ్రావణిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది.
 
అందుకే ఈ కేసులో సాయికృష్ణారెడ్డిని ఏ1, అశోక్ రెడ్డిని ఏ2, దేవరాజ్ రెడ్డిని ఏ3గా పేర్కొంటున్నాం. ఈ కేసులో ఈ ముగ్గురూ నిందితులు. ఇప్పటికే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అరెస్టు చేశాం. అశోక్ రెడ్డిని కూడా తప్పకుండా అరెస్టు చేస్తాం. వీరు ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసినవాళ్లే. ఇలాంటి వాళ్ల పట్ల మిగతా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని డీసీపీ వివరించారు. 
 
ఈ ఘటనలో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా పేర్కొనకపోవడానికి గల కారణాలను కూడా డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఏ కూతురిని కూడా తల్లిదండ్రులు చనిపోవాలంటూ వేధించరని, ఆమె శ్రేయస్సు కోరి కొంత కఠినంగా వ్యవహరించి ఉండొచ్చని తెలిపారు. తాము విశ్లేషించిన సంభాషణల్లో శ్రావణిని తల్లిదండ్రులు కూడా ఇబ్బందిపెట్టినట్టు వెల్లడైందని, కానీ తల్లిదండ్రులను ఇందులో నిందితులుగా పేర్కొనడం మాత్రం కుదరదని, వారిని బాధిత వ్యక్తికి చెందినవారిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.