శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:19 IST)

సాయిరెడ్డికి ఊరట... భత్యం తీసుకోని జోడు పదవుల్లో ఉంటే తప్పులేదు...

జోడు పదవులను అనుభవిస్తున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా రెండు పదవుల్లో కొనసాగడంలో తప్పులేదని పేర్కొంది. అందువల్ల విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య చేసిన ఫిర్యాదు చెల్లబోదంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ జోడు పదవులను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేత సీహెచ్ రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి.. విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. 
 
ఇదే ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్రపతి, సలహా కోరగా, పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ప్రకారం, ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి వేతనం, భత్యం తీసుకోని విజయసాయిపై, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు చెల్లబోదని రాష్ట్రపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.