బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (14:24 IST)

రైతులూ ధైర్యంగా ఉండండి.. రాజధానిని అంగుళం కూడా కదల్చలేరు : సుజనా చౌదరి

రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరనీ, అందువల్ల రైతులు ధైర్యంగా ఉండాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సజనా చౌదరి చెప్పుకొచ్చారు. తుళ్లూరులో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
ఇప్పటివరకు రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాజధానికి నిధులు తెచ్చుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలం అయ్యాయనీ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వనిదే తుది నిర్ణయమన్నారు. 
 
అయితే, అమరావతి వద్ద రాజధాని నిర్మించే అవకాశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందనీ, రాజధాని నిర్మాణం ఆలస్యం అవడం వల్లే స్థానిక ఎమ్మెల్యేను రైతులు ఓడించారని చెప్పారు. ఇప్పటిటవరకు రాజధాని కోసం 5 వేల 600 కోట్ల రూపాయల మేర ఖర్చు కూడా అయ్యిందని చెప్పారు. 
 
130 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 1293 ఎకరాలు కేటాయింపు జరిగిందని తెలిపారు. దీనికీ ఆయా సంస్థలు 450 కోట్లు చెల్లించాయి. విట్, ఎస్‌ఆర్ ఎంలాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయినీ, ఇంత జరిగితే ఇప్పుడు మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 
 
గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని, విజయవాడ కేంద్రంగానే ఉండాలి అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడు మాట మార్చితే ఎలా అంటూ ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలపై ఆధారపడి రాజధాని మార్చడం ఏమిటి అని నిలదీశారు. 
 
30 రోజుల పాటు మాత్రమే జరిగే అసెంబ్లీ కోసం రాజధాని ఏమిటి. సచివాలయం విశాఖలో ఉంది మంత్రుల నివాసాలు అమరావతిలో ఉండడం ఏమిటి? రాజధాని అనేది 13 జిల్లాకు సంబంధించిన అంశం 29 గ్రామలది మాత్రమే కాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల పరిశ్రమలు పారిపోతున్నాయి. రాజు మారినప్పుడల్లా రాజధాని మారటం ఏమిటీ అని సుజనా చౌదరి ప్రశ్నించారు.
 
రైతులకు నష్ట పరిహారం కట్టి రాజధాని మార్చడానికి రూ.80 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నిర్మాణం చేస్తామని అప్పులు తెచ్చారు. 2 వేల కోట్లకు పైగా బాండ్లు జారీ అయ్యాయి. ఇవన్నీ రీకాల్ చేస్తే ప్రభుత్వం కట్టేందుకు సిద్ధంగా ఉందా అని నిలదీశారు. కాంట్రాక్టర్లు, సంస్థలు తమ డబ్బు వెనక్కు ఇచ్చేయాలని కోరితే తక్షణం ప్రభుత్వం కట్టగలదా అని అడిగారు. 
 
సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సన్‌సెట్ ఆంద్రప్రదేశ్‌గా మారిపోతోంది. అసెంబ్లీలో అధికార, విపక్షాలు సమయాన్నీ వృధా చేశాయి. ఆఖరుకు బనానా రిపబ్లిక్‌లా ఏపీ కూడా దివాళా తీసే పరిస్థితులు వస్తాయి. అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల ఏపీ రేటింగ్ దేశంలో పడిపోయిందన్నారు. 
 
దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ వచ్చి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును అంగుళం కదిల్చినా బీజేపీ సహా ఏపీ ప్రజలు ఊరుకోరు. ఇన్‌సైడ్‌ర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేస్తున్నారు. నిరూపించమని చాలా సార్లు సవాలు విసిరా. కానీ ఇప్పటి వరకు నిరూపించలేక పోయారు. 7 నెలల్లో పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఆరోపించారు. 
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థ సీఐడీ అసమర్థమైందనా? పైగా, రాజధాని మార్పు పేరుతో ఇష్టానుసారంగా డబ్బును వృధా చేసేందుకు ప్రజలు అంగీకరించరు. 
కేంద్రం చూస్తూ ఊరుకోదు. దీనిపై 13 జిల్లాలోని ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
 
రాజధానిని అంగుళం కదిల్చినా ఊరుకునేది లేదన్నారు. గత ప్రభుత్వం నిధులు లేకపోయినా రాజధాని ఇక్కడే కొనసాగించింది. ఉన్న భవనాల్నే  కొనసాగించాలి. విజయసాయి రెడ్డి అనుకోని పరిస్థితుల్లో ఎంపీ అయిన నాయకుడు. నా సంస్థలపై సీబీఐ సోదాలు చేసింది. అన్ని తనిఖీ చేసింది. కానీ ఏమీ నిరూపించలేక పోయారు.

ఇప్పటికైనా అందరినీ కోరుతున్నా నా సంస్థలో ఏమైనా అవకతవకలు గుర్తించాలని, అందరికీ మా సంస్థ గేట్లు తెరిచే ఉంటాయి. ఆర్థిక నష్టాలు వేరు ఆర్థక నేరాలు వేరు. విజయసాయి రెడ్డికి ఆర్ధిక నేరాలు మాత్రమే తెలుసు అంటూ సుజనా చౌదరి మండిపడ్డారు.