కిడ్నాప్ కేసులో అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ : కరోనా ఫలితం ఏంటి?

bhuma akhila priya
ఠాగూర్|
హైదరాబాద్ బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్టు అయి ఏ1 నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా న్యాయమూర్తి నివాసంలో అఖిలప్రియను హాజరుపర్చారు.

మూడు రోజుల పోలీస్ కస్టడీలో విచారణ స్టేట్‌మెంట్‌ను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు. దీంతో అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరారు. కాగా కస్టడీలో భాగంగా బేగంపేట మహిళా పీఎస్‌లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు.

ఆ తర్వాత అఖిల ప్రియకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్‌గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, గైనకాలజి డిపార్ట్మెంట్‌లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్య
పరీక్షలు పూర్తి అయిన తర్వాత మారేడ్ పల్లి జడ్జ్ నివాసంలో హాజరుపర్చనున్నారు. అనంతరం చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు.

అంతకుముందు, అఖిల ప్రియకు వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసుల హై డ్రామా వెలుగు చూసింది. మీడియా దృష్టి మరల్చి మరోసారి అఖిల ప్రియను బేగంపేట్‌లోని పటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన అఖిల ప్రియకు ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కరోనా టెస్ట్ నిర్వహించకుండానే వైద్య పరీక్షల కోసం బోయిన్ పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అఖిల ప్రియ పోలీస్ వాహనం ముందూ వెనుకా ఎస్కర్ట్‌గా విమెన్ పోలీసులు ఉన్నారు.

మరోవైపు, బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తులో భాగంగా, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలప్రాయ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఫైనల్ దశకు చేరింది.

కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :