మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (21:11 IST)

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

E coli
విజయవాడ వరద నీరు ఓ బాలుడికి ప్రాణాంతకంగా మారింది. ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ సోకడంతో అతడి కాలును తీసేసారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో విజయవాడ నగరం ద్వారా ప్రవహించే బుడమేరుకి వచ్చిన భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ఈ క్రమంలో ఈ వరద నీటిలో తన తల్లిదండ్రులకు సాయం చేస్తూ వుండిపోయాడు 12 ఏళ్ల భవదీప్ అనే బాలుడు. వరద నీరు తగ్గేవరకూ ఇంట్లో సామానులను భద్రంగా చూసుకుంటూ వచ్చారు.
 
ఐతే అకస్మాత్తుగా రెండ్రోజుల తర్వాత బాలుడు చలిజ్వరంతో తీవ్రంగా బాధపడటం మొదలుపెట్టాడు. వైరల్ ఫీవర్ అయి వుంటుందని ఆసుపత్రికి వెళ్లగా వైద్యుడు మందులు రాసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఐనప్పటికీ జ్వరం తగ్గుముఖం పట్టకపోయేసరికి అతడిని నగరంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అతడికి ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ సోకినట్లు షాకింగ్ వార్త చెప్పారు. ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా బాలుడి శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి కండరాలను తినేసినట్లు చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ మరింతగా ముదరకుండా వుండేందుకు బాలుడి కుడి కాలును తొడ వరకూ శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఎడమకాలులో కూడా కొంతమేర ఈ బ్యాక్టీరియా తినేసినట్లు గుర్తించారు.
 
ఇలాంటి సమస్య మధుమేహుల్లో తలెత్తుతుందనీ, కానీ బాలుడికి ఇది ఎలా సోకిందో అంతుపట్టడంలేదు. బాలుడి శరీరం నుంచి తొలగించిన కుళ్లిన భాగాల నుంచి తీసిన వాటిని వైద్యులు టెస్ట్ చేసి చూడగా అందులో ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వన్నట్లు గుర్తించారు. వరద నీటిలో మురుగు నీరు కలిసినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడించారు. అందువల్ల ఎవరైనా జ్వరం వచ్చి కాళ్లు వాపు వుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.