మూడేళ్ల చిన్నారికి ప్రాణం పోసిన సీఎం చంద్రబాబు
మూడేళ్ల చిన్నారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాణం పోశారు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న బాలుడి ఇంటికి వైద్య బృందాన్నే పంపించారు. అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెంటనే ఎల్బీసీ ఇప్పించారు.
విషయంలోకి వెళితే.. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటకు చెందిన దేవాన్షా అనే మూడేళ్ల బాలుడు గత కొన్ని రోజుల క్రితం టైఫాయిడ్ బారిన పడ్డాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో 14 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4 శాతానికి పడిపోయింది. దీంతో దేవాన్షా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొడుకు దక్కుతాడో, లేదోనన్న పుట్టెడు దుఃఖంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ఏంచేయాలో పాలుపోని స్థితిలో విషయం సీఎం పేషీలో హెల్త్ డిపార్టెమెంట్ చూసే అధికారులకు చేరింది. బాలుడి పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. ఎలాగైనా సరే దేవాన్షా ప్రాణాలను కాపాడాలని సీఎంఓలోని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆఘమేఘాలపై వెంటనే మెడికల్ టీంను నేరుగా ఇంటికి పంపి అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారు మెరుగైన చికిత్స కోసం యుద్ధ ప్రాతిపదికన ఎల్జీసి ఇచ్చి విజయవాడ ఏలూరు రోడ్డులోని రెయిన్ బో ఆసుపత్రిలో చేర్పించారు.
దాదాపు 11 రోజుల పాటు చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. చికిత్స అందుతున్న 11 రోజుల పాటు దేవాన్షా ఆరోగ్య పరిస్థితిపై సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యంతో సంప్రదించి ఎప్పటికప్పుడు సీఎంకు తెలియజేశారు. పూర్తి ఆరోగ్యవంతుడైన దేవాన్షా తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మ నిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వైద్య సేవలపై వాకబు చేసిన సీఎం పేషీ అధికారులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.