బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:03 IST)

వాహనసేవల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు .. ఉదయం హనుమంత వాహనం.. రాత్రి గజవాహన సేవ

తుమ్మలగుంటలో బ్రహ్మాండ నాయకుడు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. 

వాహన సేవల్లో కళాకారులు నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సందడి కనిపించింది. కళాకారులు విభిన్న కళా ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక విందును పంచుతున్నాయి. ఆలయం,  రహదారుల వెంట ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు,  పుష్పాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. 
 
హనుమంత వాహన సేవ 
ఉదయం స్వామి వారు శ్రీరామచంద్రుని రూపంలో త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుంతుడిని వాహనంగా చేసుకుని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి భక్తులను కటాక్షించారు. హను మంతుని భక్తి తత్పరతను తెలియజేస్తూ శ్రీవారు..  రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అన్నీ అవతారాలలో తానేనని ఈ సేవ ద్వారా భక్తకోటికి తెలియజేశారు. ఈ వాహన సేవలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి తో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని వాహమోత సేవకులుగా మారి తరించారు. 
 
గజవాహన సేవ 
రాత్రి ముగ్ధమనోహరుడైన కల్యాణ వెంకన్న గోవిందుడి రూపంలో గజవాహనంపై ఆశీనుడై రాజసంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తనను శరణుకోరే వారిని ఎల్లవేళలా కాపాడుతానని భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన సందర్భాన్ని కల్యాణ వెంకన్న ఈ వాహనం ద్వారా తెలియజేశారు.

శ్రీవారిని శరణు కోరితే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్త జనుల గోవింద నామస్మరణులు, వేద పండితుల ప్రబంధ గోష్టి నడుమ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ఊంజల్ సేవ వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త , ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కల్యాణ వెంకన్న వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, సర్పంచ్ నల్లందుల సుబ్బరామిరెడ్డి, ఆలయ అర్చ కులు బాలాజీ దీక్షితులు, వేద పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మాజీశర్మ , భక్తులు పాల్గొన్నారు.