బొండా ఉమ బంగీ జంప్ దేనికి సంకేతం?
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు బంగీ జంప్ విన్యాసాలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన న్యూజిలాండ్‌లో బంగీ జంప్ చేశారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారుతారనే చర్చ బాగానే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇపుడు చేసిన ఓ ట్వీట్‌తో టీడీపీ నేతల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ ప్రారంభమైంది. విదేశాల్లో ఆయన చేసిన బంగీ జంప్ దృశ్యాలను ఆ ట్వీట్‌కు జోడించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
సాధారణ ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా ఉమామహేశ్వర రావు కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు.
దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్ డిమాండ్ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ దాన్ని కొట్టివేశారు. దీంతో ఆయన కాస్త అసంతృప్తికి గురయ్యారు.