శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

పోలవరం 5ఏ ప్యాకేజీ పనులు రద్దు!

పోలవరం ప్రాజెక్టులోని కొన్ని పనులకు ప్రభుత్వం మరోసారి రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు వెళ్తోంది. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి చేపట్టిన ఐదో నెంబర్‌ ప్యాకేజీలోని... సుమారు 65కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేసింది.

త్వరలోనే టెండర్‌ కమ్ రివర్స్‌ ఆక్షనింగ్‌ ద్వారా కొత్త సంస్థకు పనులు అప్పగించనుంది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎడమ ప్రధాన కాలువలోని 5-ఏ ప్యాకేజీ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎడమ ప్రధాన కాలువ పనులను 8 ప్యాకేజీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదో నెంబర్‌ ప్యాకేజీని సవీర్‌ డ్యాం వాటర్‌ వర్క్స్​ కంపెనీకి గతంలో అప్పగించింది.

దాదాపు 181 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన ఐదో ప్యాకేజీ పనులను ఆ సంస్థ చేపట్టింది. 2018 జూన్‌-జులైలో... పీఎస్​కే-హెయిఎస్ భాగ్యస్వామ్య సంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా ఆ పనులు దక్కాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ తవ్వకానికి సంబంధించి చేపట్టిన పనుల్లో దాదాపు 64 శాతం మేర... 117 కోట్ల 5 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తిచేశారు.

ఇంకా 64 కోట్ల 81 లక్షల విలువైన పనులు చేయాల్సివుంది. ఈ మిగిలిన పనులనే రద్దు చేస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. త్వరలోనే ఈ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో తిరిగి టెండర్లను పిలవనున్నారు.