శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:01 IST)

వరి రైతులకు నేరుగా ఖాతాల్లోకే నగదు జమ: మంత్రి కన్నబాబు

రైతుల సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రైతు పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

రైతుల కోసం ఏదైనా చేస్తామని అది మన బాధ్యతగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఛైర్మన్ గా ఇప్పటికే వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి రైతుల సంక్షేమం కోసం ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారని గుర్తుచేశారు. దీంతో పాటు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగపడుతున్నారన్నారు.

గతంతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయని, రాష్ట్రవ్యాప్తంగా అధిక దిగుబడులు వచ్చాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రతి రోజు సంబంధిత అధికారులతో మాట్లాడుతూనే ఉన్నామన్నారు. వరి పండించిన రైతులు ఈ-పంట విధానంలో 14 లక్షల 67వేల 69 హెక్టార్లలో 88 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయిందని పేర్కొన్నారు.

60 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ కు  రానుందన్నారు.  ఇప్పటి వరకు 1283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇంకా అవసరమైతే అదనంగా కూడా ఏర్పాటు చేయాలన్నారు.  రైతులు పండించే పంటల్లోని రకాలను(ఈఎస్-310, కే-210 ) మంత్రి వివరించారు. ఫామ్ గేట్ (పొలం నుంచే ధాన్యం కొనుగోలు) ఏర్పాటు  చేశామని మంత్రి తెలిపారు.

ఆ పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 48 గంటల్లో నగదు రైతు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. ఈ మొత్తం కార్యక్రమం ఐదు రోజుల్లో పూర్తి చేస్తూ వస్తున్నామని  ప్రతి రైతుకు తమ ఖాతాల్లో ప్రభుత్వం వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను ప్రాంతాల వారీగా జమ చేయడం జరుగుతుందన్నారు. ముతక రకం ధాన్యం రూ.1810, ఏ గ్రేడ్ ధాన్యం రూ.1830 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో పండించే ధాన్యానికి అధిక ధరలు రావడంతో రైతుల నుంచి రైసుమిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 3 లక్షల 62 వేల 955 మెట్రిక్ టన్నుల ధాన్యం నేటి వరకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 25వేల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేయడం జరిగిందన్నారు. మరో 14వేల మంది రైతులకు నగదు చెల్లింపులు చేయనున్నామన్నారు.

25వేల మంది రైతుల ఖాతాల్లో రూ.407 కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు. ప్రతిరోజూ 4 నుంచి 7 కోట్లు నగదు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నిధులను పౌర సరఫరాల విభాగంలో నిధులు ఉంచినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

రైతు నష్టపోకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారన్నారు.  ప్రస్తుతం అధికారులు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి పండిన పంట  తేమ శాతాన్ని గుర్తించి రశీదు అందించడం జరుగుతోందన్నారు. దాన్ని బట్టి నిర్ణయించిన ధరను మార్కెట్ కు చేరిన తర్వాత రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామన్నారు. 

గత పది రోజులుగా ఇదే కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కొందరు రాజకీయ నాయకులు తమ ప్రభుత్వంపై బురదజల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రతిపక్షాలు ఇసుక, ఆంగ్లవిద్య, రాజధాని అంశాలపై విమర్శలు చేసి అవి పరిష్కారం కావడంతో ఉల్లి, ధాన్యం అంశాలను తెరమీదకు తెస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇతరులతో చెప్పించుకునే స్థాయిలో తమ ప్రభుత్వం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండపేట లో సమావేశం పెట్టి రైతులకు పంట కొనుగోలు నగదు చెల్లించడం లేదని ఆందోళన చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కు తప్పుడు నివేదికలు ఎవరిస్తున్నారో తెలియడం లేదన్నారు. అటువంటి ప్రకటనలు మానుకోవడం మంచిదని హితవు పలికారు.  తమ ప్రభుత్వం రైతు పక్షాన పనిచేసే విధానంతో ముందుకు వెళ్తుందన్నారు.

సమస్యలు లేకపోయినా ఉన్నట్టుగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2015లో ఇదే రశీదు విధానాన్ని అమలు చేసి రైతులకు బకాయిలు చెల్లించకుండా ఎగనామం పెట్టిన విషయాన్ని రైతులు గుర్తిస్తున్నారని మంత్రి అన్నారు. ఎవరో చెప్పింది విని తప్పుడు మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. రాజకీయ భాషలో మాట్లాడితే మేం కూడా అదే విధంగా స్పందిస్తామన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు రక్తపు కూడు తింటున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనమని మంత్రి ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం శాశ్వత ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది యూరియా కొరత కారణంగా రైతులు క్యూ కట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

తమ పాలనలో ఏ ఒక్క రైతూ ఇలా ఇబ్బందులు పడ్డారా అని ప్రశ్నించారు. రాయితీపై విత్తనాలు   ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వేసిన పంట నష్టపోతే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించామన్న విషయం గుర్తుచేశారు. శనగరైతులు, సుబాబుల్ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 

ధాన్యం దిగుబడులు కొన్ని చోట్ల అధికంగా పెరిగాయని, కొన్ని చోట్ల తగ్గాయన్నారు. బోండా రకం వరిధాన్యం పంట నష్టాలు కలుగుతుండటంతో దాన్ని నియంత్రించామన్నారు. ఎక్కడ రైతులకు మేలు జరుగుతుందో అక్కడ సహకారం అందిస్తామన్నారు. ఈ –క్రాఫ్ బుకింగ్ విధానం ఉన్నా ఆఫ్ లైన్ లో కూడా తమ పంటల కొనుగోలుకు  వీలు కల్పించేలా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

65 లక్షల మంది రైతులు వరి ధాన్యాన్ని పండిస్తే కేవలం 4 లక్షల మంది రైతులు మాత్రమే ప్రతి ఏటా ప్రభుత్వం ద్వారా అమ్మకాలు చేస్తున్నారన్నారు. దీనిలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు నేరుగా ఈ-క్రాఫ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

కౌలు రైతులు పండించిన పంట నగదును వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. పొలం ఉన్న రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామనడం అవాస్తవమన్నారు. ఎక్కడైనా అలాంటి పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.