మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (10:12 IST)

ఓటుకు నోటు కేసు : చంద్రబాబు గుండెల్లో రైళ్లు... ఢిల్లీలో సుజనా చౌదరి మంతనాలు

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునే ఉంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునే ఉంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలు మంగళవారం అందడంతో ఏసీబీ కసరత్తు ముమ్మరమైంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 29వ తేదీలోగా నివేదిక అందజేయాలని, నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం న్యాయనిపుణుల సలహా కోరుతున్నారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌లు మంగళవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో కోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై గవర్నర్‌తో వీరు చర్చించినట్లు సమాచారం. వీరితోపాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. కాగా ఎన్నడూ లేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 2 గంటల సేపు గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌లో గడపడం విశేషం.
 
ఇదిలావుండగా, కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి ఢిల్లీలో చర్చల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకుని కేంద్ర మంత్రులతో వరుసభేటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు కేంద్ర సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో ఆయన సమావేశమై ఓటుకు నోటు కేసుతో పాటు 'స్విస్ చాలెంజ్' కేసులపై చర్చించినట్టు సమాచారం. కానీ, ప్రత్యేక హోదా, ఏపీ ప్యాకేజీపైనే తమ దృష్టికేంద్రీకృతమై ఉన్నట్టు సుజనా మీడియాకు వెల్లడించారు.