రాజధాని రైతుల కోసం పాద యాత్రలో పాల్గొంటా: సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ
రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కీలక ప్రకటన చేసారు. తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన లక్ష్మీ నారాయణ తాను కూడా రైతుల పాద యాత్రలో పాల్గొంటానని చెప్పారు. రైతుల మహా పాదయాత్రకి తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 681 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారని, అయినా ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని వ్యాఖ్యలు చేసారు.
రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అన్నారు. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే, మనసు కలిచివేస్తుంది అని వ్యాఖ్యలు చేసారు. మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి భాధ ఆవేదన కలిగిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజధానిని ఇక్కడే నిర్మించాలి అని డిమాండ్ చేసారు.
ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా రాజధానిపై ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి అని ఆయన కోరారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదు...అమరావతి అనేది రాష్ట్ర సమస్య అని అన్నారు. గత ప్రభుత్వం కొంత ఖర్చు చేసి ఎంతో కొంత నిర్మాణ పనులు చేశారని, పది వేల కోట్లు ఖర్చు చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ నిర్మాణాలను తాను పరిశీలించానని, వాటిలో చాలా నిర్మాణాలు70 నుండి 90 శాతం పూర్తి అయ్యాయి అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల త్యాగం మరిచిందని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులు వారి స్వార్ధం కోసం భూములు ఇవ్వలేదని, రైతులపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు అంటూ మండిపడ్డారు.
10 ఏళ్ల తరువాత కూడా రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే, రైతులకు కౌలు మరో ఐదేళ్లు పెంచాలి అని కోరారు. రాజధాని రైతుల ఉద్యమానికి తనకున్న పరిజ్ఞానం మేరకు న్యాయ సహాయం అందిస్తాఅని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. రైతుల న్యాయస్థానం నుండి దేవస్థానం రైతు మహా పాదయాత్రలో తాను వీలున్న చోట భాగస్వామిని అవుతానని అన్నారు.