చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో కోర్టులు, జడ్జిలను విమర్శించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులిచ్చింది.
గతంలో న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.
ఇప్పటికి తాము గుర్తించిన 49 మందికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసుల్లో తీర్పు చెప్పిన తర్వాత అధికార పార్టీ నేతలు నేరుగా కోర్టులను, జడ్జిలను విమర్శించారు.
ఇక వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.