వైసీసీ శత్రువు! అమరావతి స్టాండ్... ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు... వెళ్లారు. అయితే, ఈ పర్యటన ఆద్యంతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎంతో సానుకూలంగా ఉన్నట్లే కనిపించింది. ఆంధ్రప్రదేశ్ కు తీరాల్సిన లోటు బడ్జెట్, తెలంగాణా నుంచి రావాల్సిన వాటా... ఇతర అంశాలపై అమిత్ షాతో ఎపీ సీఎం జగన్ చర్చించినట్లు, అన్ని అంశాలపైనా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నేతలు చెపుతున్నారు.
అయితే, ఇదంతా అధికార కేంద్రం తరఫున యాక్షన్.... బీజేపీగా ఒక పార్టీ పరంగా ఆయన వైఖరి వేరేలా ఉందని చెపుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన జరిపిన సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.
ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. వైసీపీయే మన ప్రధాన శత్రువు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన, అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్... రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారట.
ఇక పవన్ కల్యాణ్ ని ఎందుకు వదిలేస్తున్నారని ఏపీ బీజేపీ నేతల్ని అమిత్ షా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జనసేన మన మిత్రపక్షం.... కలసి ముందుకు సాగండి... అని సూచించిన ఆయన, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని తెలిపారట. బీజేపీ నేతలు కలిసిరాకపోవడంతో జనసేనాని పవన్ కల్యాణ్ సొంతంగా తన కార్యాచరణ చేసుకుపోతున్నాడని, బీజేపీ నేతలు ఎవరో అమిత్ షా కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కార్యక్రమాల్లో బీజేపీ ఎందుకు పాలుపంచుకోవడం లేదని అమిత్ షా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన చేసే ప్రతి కార్యక్రమానికి బీజేపీ కూడా సంఘీభావం తెలిపి పాలుపంచుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు షా చెప్పినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ గా మారిందని, ఈ దశలో ప్రయివేటీకరణ బీజేపీకి రాజకీయంగా తీరని దెబ్బ అని పార్టీ నేతలే అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసి, తర్వాత విషయం ఏం చేయాలో ఆలోచించవచ్చని స్థానిక బీజేపీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి, తాను ఢిల్లీకి వెల్లిన తర్వాత సంబంధిత అధికారులతో చర్చించి, ప్రజామోదం మేరకు నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.