మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (08:00 IST)

ఏపీలో తితిదే ఈవో ధర్మారెడ్డి సర్వీసు పొడగింపు

dharmareddy
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి సర్వీసులను వైకాపా ప్రభుత్వం మరో రెండేళ్లు పొడగించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీచేసింది. కేంద్ర సర్వీసులకు చెందిన ఈయన ఇప్పటికే ఏడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఇపుడు మరో రెండేళ్లపాటు ఏపీలో సేవలు అందించనున్నారు. 
 
ప్రస్తుతం ఈయన తితిదే ఈవోగా పని చేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉండే ఏ అధికారి అయినా రాష్ట్ర సర్వీసుల్లో అత్యధికంగా ఏడేళ్లకు మించి పని చేయడానికి వీల్లేదు. ఈ లెక్కన ధర్మారెడ్డి ఏడేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుని తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లాల్సివుంది. 
 
అయితే, ధర్మారెడ్డి సేవలను ఎలాగైనా పొడగించుకోవాలన్న పట్టుదలతో సాగిన ఏపీ ప్రభుత్వం పావులు కదిపింది. మరో రెండేళ్ళపాటు ధర్మారెడ్డిని ఏపీ సర్వీసులోనే కొనసాగేలా అనుమతి ఇవ్వాలని ఈ కేసును ప్రత్యేకమైనదిగా పరిగణించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. 
 
ఒకవేళ దీనికి కేంద్రం సమ్మతించకపోతే ధర్మారెడ్డి కేంద్ర సర్వీసులకు రాజీనామా చేసి ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అధికారిగా నియమించుకుని తితిదేలోనే కొనసాగించే దిశగా ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ, ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ధర్మారెడ్డి మరో రెండేళ్ల పాటు ఏపీ సర్వీసుల్లో కొనసాగనున్నారు.