2024 ఎన్నికలు: . జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్?
2024 ఎన్నికల్లో ఏపీలో విజయం దిశగా బీజేపీ, టీడీపీ, జనసేన కార్యాచరణ రూపొందిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన, బీజేపీ పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టిపెట్టిన బీజేపీ అధిష్టానం.. త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నడ్డా పర్యటన తర్వాత 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నారు.
బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ కు అనుగుణంగా రెండు పార్టీలు కలిసి జిల్లాల్లో బహీరంగ సభలు నిర్వహించనున్నారు.
జనసేన-టీడీపీ పొత్తుపెట్టుకోబోతున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య సంబంధాలు బలపడతాయని బీజేపీ భావిస్తోంది.
అంతేగాక జనసేన-బీజేపీ కూటమిలోకి టీడీపీని రానివ్వడం బీజేపీకి ఇష్టం లేదని.., అందుకే ముందుగానే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీని అడ్డుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటు జనసనే పార్టీ కూడా అదే కోరుకుంటోంది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. చివరి నిముషంలో టీడీపీ ఎంటరై కూటమి గెలిచినా తమ నాయకుడు సీఎం అవుతాడని జనసైనికులంటున్నారు.
ప్రస్తుతం బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఉన్నదల్లా జనసేనతో పొత్తు అనే బలమే. అందుకే పవన్ తో పొత్తులో ఉంటే ఏపీలో క్రమంగా పుంజుకోవచ్చని.. పవన్ నుంచి విడిపోతే ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. అందుకే కూటమి సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ క్లారిటీకి వచ్చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.