మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జేపీ నడ్డా పర్యటన

jp nadda
భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పనిలోపనిగా పార్టీని సంస్థాగతంగా బలోపేత చేసే దిశగా ఆ పార్టీ కీలక నేతలు దేశ వ్యాప్తంగా విస్తృతస్థాయిలో పర్యటనలు జరుపుతున్నారు. 
 
ఇందులోభాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ నేతలకు కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే, పార్టీని బలోపేతం చేసే చర్యల్లోభాగంగా, రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తి కేంద్రాలుగా మార్చింది. వాటికి ఇన్‌చార్జులను నియమించింది. 
 
ఆయా శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లతో జేపీ నడ్డా విజయవాడలో కీలక భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పుర ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శలతో సమావేశమవుతారు. అందులో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రణాళికలు, తదితర అంశాలపై చర్చింనున్నారు. 
 
కాగా, వచ్చే 2024లో ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసిపోటీ చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిపై కూడా జేపీ నడ్డా చర్చించే అవకాశం ఉంది.