గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (12:22 IST)

తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : హోం మంత్రి అమిత్ షా

amit shah
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వం మారబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక దశాబ్దాల పాటు ఉద్యమం జరిగిందన్నారు. అయితే, 2004-2014 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. అయితే, 2014లో జరిగిన ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. అదీ కూడా తమ పార్టీ గట్టిగా పట్టుబట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. 
 
అదేసమయంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోడీ స‌ర్కారు క‌ట్టుబ‌డి ఉందన్నారు. తెలంగాణ‌పై ఏనాడూ స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపించ‌లేదన్నారు. త‌మ‌కు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న ఆయ‌న ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామ‌న్నారు.  రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగ‌మిస్తుంద‌ని తాము న‌మ్ముతామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
 
అతి త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మార‌బోతోందని అమిత్ షా చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం స్థానంలో బీజేపీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.