ఢిల్లీ పర్యటనలో జగన్: అమిత్ షాతో భేటీ-రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం నిధులపై..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వీరి సమావేశంలో ప్రధానంగా విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం.
గురువారం సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలను విన్నవించారు. రెవెన్యూ లోటు నిధులను వెంటనే విడుదల చేయాలని జగన్ కోరారు. 2014-15 రెవెన్యూలోటుతో పాటు 32,625 కోట్లు ఏపీ ప్రభుత్వానికి రావల్సి ఉందని పేర్కొన్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టంలో సవరణలు కోరుతున్నారు జగన్. లబ్దిదారుల ఎంపికలో కొన్ని సవరణలు కోరుతున్నారు. దీనిపై అమిత్ షాకు నివేదిక ఇచ్చారు. రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం నిధులపై చర్చించారు.
కొత్త మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ పెండింగ్ సమస్యలపైనే కేంద్ర హోంశాఖ మంత్రితో జగన్ చర్చించారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది.