శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (14:04 IST)

బీజేపీలో చేరనున్న సినీ నటి దివ్యవాణి

Divyavani
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇదే అంశంపై ఆమె బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుతో మంతనాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఆమె నేడో రేపో కషాయం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 
 
కాగా, తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు నటి దివ్యవాణి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెల్సింది. ఇటీవల ఒంగోలులో జరిగిన పార్టీ మహానాడులో తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, పైగా, పార్టీలో కూడా తనకు గుర్తింపు లేదని, తగిన గౌరవ మర్యాదలు లేదని ఆమె ఆరోపించిన విషయం తెల్సిందే. దీంతో ఆమె  పార్టీకి రాజీనామా చేశారు. 
 
ఇదిలావుంటే, ఒక రాష్ట్ర స్థాయి నేత ద్వారా సోము వీర్రాజును సంప్రదించిన దివ్యవాణి బీజేపీలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, హిందూయేతర ప్రస్తావనను పదేపదే తెచ్చే దివ్యవాణిని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై బీజేపీ రాష్ట్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.