గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (18:43 IST)

నేనెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే...? కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి

Divyavani
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాల్సి రావడంపై సినీ నటి దివ్యవాణి మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఓ దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేరుగా చంద్రబాబు నాయుడుకు చెప్పేందుకు కూడా తనకు అవకాశం లేకుండా పోయిందన్నారు. నిన్న బుధవారం మధ్యాహ్నం ఆయనను కలిసేందుకు 2.45 నుంచి రాత్రి 7.45 నిమిషాల వరకూ వేచి వుండాల్సి వచ్చిందన్నారు.

 
ఇంకా ఆమె మాట్లాడుతూ... ''పేరుకే అధికార ప్రతినిధిని కానీ మాట్లాడేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేసారు. మహానాడులో ప్రసంగం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ కోసం నిండు మనసుతో నేను వస్తే, టిక్కెట్ కోసమో... ప్యాకేజీ కోసమో అంటూ రకరకాలుగా మాట్లాడారు. ప్రజలకు చేతనైనది చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. తెదేపాలో చేరి ఆ పని చేద్దామనుకున్నా.

 
ఐతే గత ఏడాదిగా నన్ను అధినేత చంద్రబాబుతో కలవనీయకుండా కొంతమంది పార్టీలోని దొంగలు అడ్డుపడ్డారు. ఒకానొక సందర్భంలో స్టేజి పైన కూర్చోవడానికి తమకు అవకాశం ఇప్పంచాలని సీనియర్ మహిళా నాయకులు సైతం నన్ను అడిగారు. అంతవారే నన్ను అడుగుతున్నారని తెలుసుకుని పార్టీలో నాకు సముచిత స్థానం వుందని భావించాను. కానీ నా పట్ల వ్యతిరేకత కూడగడుతున్నారని తెలుసుకోలేకపోయాను.

 
ఇప్పటికైనా పార్టీ పరిస్థితిని, తను తెలుగుదేశంలో ఎందుకు చేరానన్న విషయాన్ని చెప్దామని ప్రయత్నించా. చంద్రబాబు గారు... ఏయ్... ఆగమ్మా అంటూ హార్ష్ గా మాట్లాడారు. అయినప్పటికీ ఆయనను తండ్రిగా భావించి ఆ మాటలను వేరేగా తీసుకోలేదు. పార్టీలో నా స్థానమేమిటో తెలియని స్థితిలో వుండటం కంటే రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నా" అంటూ చెప్పారు దివ్యవాణి.