గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (13:26 IST)

తెదేపాకు షాకిచ్చిన దివ్యవాణి - వైకాపా తీర్థం పుచ్చుకునేందుకేనా?

divyavani
ఇటీవల ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు ఫుల్ సక్సెస్ అయిందన్న ఫుల్‌జోష్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సినీ నటి దివ్యవాణి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానీలతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవంటూ వ్యాఖ్యలు చేసిన రెండు మూడు రోజులకే ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. 
 
నిజానికి టీడీపీ తరపున గట్టిగా స్వరం వినిపిస్తూ వైకాపా నేతలకు, మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్న వారిలో దివ్యవాణి ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే ఈమె ఆ పార్టీకి అనధికార ప్రతినిధిగా వ్యవహించారు. కానీ, ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా దివ్యవాణి తెలియజేశారు. అసలు తానెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. 
 
"అందరికీ ధన్యవాదాలు.. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు. 
 
అయితే, దివ్యవాణి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను తాజాగా వివరించారు. మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. 
 
దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు.  ఒక క‌ళాకారుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురిచేసింది. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను" అని పేర్కొన్నారు.