శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జూన్ 2024 (16:39 IST)

ఓట్ లెక్కింపు ఏర్పాట్లపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

mukesh kumar meena
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో 4వ తేదీన చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 
 
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్‌కోర్‌లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటుపై సీఈవో పలు సూచనలు చేశారు. 
 
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్‌ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్షించారు.