1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (11:47 IST)

రామతీర్థం రగడ : ఏపీలో బీజేపీ నేతల గృహనిర్బంధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామతీర్థం రగడ మొదలైంది. రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఈ ఆలయం వద్దకు వెళ్లేందుకు బీజేపీ నేతలు మంగళవారం నిర్ణయించుకున్నారు. కానీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 
 
విజయనగరం జిల్లా రామతీర్థంలోని దేవాలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసానికి నిరసనగా, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ధర్మయాత్ర, ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
రామతీర్థం ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని వీర్రాజుకు స్పష్టం చేసిన పోలీసులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌కు ఆయన్ను తరలించారు.
 
అలాగే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేసి, వారు బయటకు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా, వీర్రాజు రామతీర్థం కూడలి వరకూ చేరుకోగా, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. 
 
ముందుకు వెళ్లనివ్వకపోవడంతో, బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగింది. వారందరినీ చెదరగొట్టిన పోలీసులు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై బైఠాయించిన సోము వీర్రాజు, తాము ధర్మయాత్రను ముందుగానే ప్రకటించామని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, జగన్ ప్రభుత్వం దాష్టీకాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. రా
 
మతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ నేతలను అనుమతించిన పోలీసులు, తమనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన బీజేపీ, జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
ఇదిలావుండగా, విశాఖపట్నం బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ధర్మయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేశ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లను కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం గేట్లను మూసివేసి, తాళాలు వేసిన పోలీసులు, నేతలను లోపలే నిర్బంధించారు.
 
ఏపీ పోలీసుల చర్యపై బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు మండిప‌డ్డారు. 'రామతీర్థంకు బీజేపీ-జనసేన శాంతియుత యాత్రను అడ్డుకునే వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయసాయి(వైసీపీ), చంద్రబాబు(టీడీపీ)లను పోలీసు రక్షణతో సందర్శించడానికి అనుమతించగా, మా అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని నిరోధించారు. ఈ ద్వంద్వ‌ ప్రమాణాలు ఎందుకు?' అని నిలదీశారు.