గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 25 అక్టోబరు 2021 (10:48 IST)

ఢిల్లీకి చేరిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు ఢిల్లికి ప‌య‌నం అయ్యారు.  చంద్రబాబు నేతృత్వంలోని బృందం రెండు రోజులు దిల్లీలో పర్యటించనుంది.
 
ఈ రోజు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడికి రాష్ట్ర‌ప‌తి అప్పాయింట్ మెంట్ ఉంద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు చెపుతున్నాయి. ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వాన్నిబ‌ర్త్ ర‌ఫ్ చేసి, రాష్ట్ర ప‌తి పాల‌న విధించాల‌నే ప్ర‌ధాన డిమాండుతో ఈ ప్ర‌తినిధి బృందం ఢిల్లీకి చేరింది. చంద్ర‌బాబుతోపాటు రాష్ట్రపతిని కలవడానికి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, బనగానపల్లే మాజీ ఎమ్మెల్యే బి.సి.జనార్దన్ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి త‌దిత‌రులు న్యూఢిల్లీ చేరారు. 
 
ఏపీలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి రామ్ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగింది. వైసీపీ నేత‌లు టీడీపీపై ఎదురు దాడికి దిగారు. ప‌ట్టాభి ఇంటిపై దాడి చేయ‌డ‌మే కాకుండా, తెలుగుదేశం జాతీయ కార్యాల‌యంపై మూకుమ్మ‌డిగా వచ్చి దాడికి పాల్ప‌డ్డారు. ఇది టీడీపీలో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణం అయింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర నిర‌స‌న‌తో 36 గంట‌ల‌పాటు పార్టీ కార్యాల‌యంలో ధ్వంసం అయిన ఫ‌ర్నిచ‌ర్ మ‌ధ్యే నిర‌స‌న‌కు దిగారు. దీనికి భారీగా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు న‌లుచెర‌ల నుంచి త‌ర‌లి వ‌చ్చ పార్టీ అధినేత‌కు సంఘీభావం తెలిపారు.
 
ఇపుడు త‌న దీక్ష విజ‌య‌వంతం కావ‌డంతో, త‌దుప‌రి చ‌ర్య‌గా చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి ఏపీ ప‌రిస్థితులు వివ‌రించ‌డానికి ఢిల్లీకి వ‌చ్చారు. ఆయ‌న రాష్ట్ర‌ప‌తిని క‌లిసి, ఏపీలో పాల‌న అరాచ‌కంగా మారింద‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగింద‌ని వివ‌రించ‌నున్నారు. ఆర్టిక‌ల్ 365 కింద రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను ఇక్క‌డ విధించాల‌ని కోర‌నున్నారు. రాష్ట్ర‌ప‌తితో పాటు ఆయ‌న భార‌త హోం మంత్రి అమిత్ షా, ఇత‌ర బీజేపీ పెద్ద‌లు, జాతీయ పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లవ‌నున్నారు. రెండు రోజుల పాటు బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.