శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:27 IST)

మాస్కులెక్కడ అని ప్రశ్నిస్తే వేటు వేస్తారా? చంద్రబాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాస్కులెక్కడ అని ప్రశ్నించిన వైద్యుడుని సస్పెండ్ చేశారనీ, ఇపుడు నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై కూడా అదే విధంగా చేశారనీ ఆరోపించారు. మాస్కులు అడిగితే వేటు వేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని భావించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రహస్య జీవోలు తెచ్చి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది మాస్కులు, రక్షణ ఉపకరణాలు లేక నిస్సహాయుల్లా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి రక్షణ లేకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్న ఈ ముందు వరుస సైనికులైన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది పట్ల వైఎస్ జగన్ మరింత మానవత్వం ప్రదర్శించాలని కోరారు.
 
తమకు మాస్కులు లేవని, రక్షణ దుస్తులు కావాలని అడిగిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేశారని గుర్తుచేశారు. నగరిలో నాలుగు కరోనా కేసులున్నా, ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, అకౌంట్లను సీజ్ చేశారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి ఓ వీడియోలో తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. 
 
దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు ఆయనపై కఠిన ఆంక్షలు విధించింది. వెంకట్రామిరెడ్డిని నగరి విడిచి వెళ్లొద్దని హుకుం జారీ చేయడమే కాదు, ఆయన స్థానంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ క్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావును ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది.